Jeans: చాలా మందికి రోజంతా వేసుకున్న జీన్స్ ప్యాంటునే రాత్రిపూట కూడా వేసుకుని పడుకునే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఎంతవరకు క్షేమం? దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి? అనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. ఒకవేళ మీరు కూడా ఇదే తప్పు చేస్తున్నట్లయితే వెంటనే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ చిన్న పొరపాటు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం
రాత్రిపూట బిగుతుగా ఉండే జీన్స్ వేసుకుని పడుకోవడం వల్ల తొడలు, జననేంద్రియాల వద్ద గాలి సరిగ్గా ఆడదు. దీనివల్ల ఆ ప్రాంతంలో విపరీతంగా చెమట పట్టడం, చర్మం నల్లబడటం, మంట వంటి సమస్యలు వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా టైట్ జీన్స్ ధరించడం వల్ల పురుషులలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది శుక్రకణాల నాణ్యత, ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో ఈ అలవాటు సంతానోత్పత్తి సమస్యలకు దారితీసి, వైవాహిక జీవితంలో ఇబ్బందులకు కారణం కావచ్చు.
Also Read: సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్!
చర్మ ఇన్ఫెక్షన్ల ముప్పు
జీన్స్ క్లాత్ చెమటను సరిగ్గా పీల్చుకోదు. రాత్రంతా చర్మంపై తేమ, చెమట అలాగే పేరుకుపోవడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, మంట, తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించడం ఉత్తమం.
జీర్ణక్రియపై ప్రభావం
రాత్రిపూట జీన్స్ ధరించడం మీ జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. టైట్ జీన్స్ పొత్తికడుపు, నడుము భాగంలో ఒత్తిడిని కలిగిస్తాయి. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మహిళలకు పీరియడ్స్ సమయంలో జీన్స్ ధరించడం వల్ల నొప్పి, అసౌకర్యం మరింత పెరుగుతాయి.
