Hilsa fish : పులస చేప అంటే గోదావరి జిల్లాల ప్రజలకు ఒక ప్రత్యేకమైన మక్కువ.”పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి” అనే నానుడి ఈ చేపకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. దీనికి అంత డిమాండ్ ఉండటానికి ముఖ్య కారణం, ఇది రుచిలో అద్భుతంగా ఉండటం, అరుదుగా లభించడం. పులస చేపను సముద్రంలో ఉన్నప్పుడు ‘వలస చేప’ లేదా ‘హిల్సా’ అని పిలుస్తారు. ఇది సంతానోత్పత్తి కోసం సముద్రం నుండి గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వలస వస్తుంది. ఈ ఎదురీత ప్రయాణంలోనే ఈ చేప శరీర నిర్మాణంలో, కండరాల స్వరూపంలో మార్పులు వస్తాయి. గోదావరి తీపి నీటిలో చేరిన తర్వాత దాని రుచి మరింత పెరుగుతుందని చెబుతారు.
పులస విశేష గుణాలు..
పులస చేపకు ఉన్న విశేష గుణాలు దాని ప్రత్యేక రుచికి కారణం.ఇది కేవలం గోదావరి నదిలో, ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రం కలిసే ప్రాంతంలో మాత్రమే లభిస్తుంది. సముద్రపు ఉప్పునీరు, గోదావరి తీపి నీరు కలిసే ప్రాంతంలో ఈ చేప జీవించడం వల్ల దీని రుచి అసాధారణంగా ఉంటుంది. దీని మాంసం చాలా మెత్తగా, సున్నితంగా ఉంటుంది. చేపలోని మంచి కొవ్వులు, ప్రత్యేకమైన రుచి దీనికి ఎంతో ఖరీదును తెచ్చిపెట్టాయి. ఈ చేపలో ముళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిని జాగ్రత్తగా తొలగించి తినేందుకు ప్రజలు అధిక ధర చెల్లించడానికి వెనుకాడరు.
పులస చేప ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల తీర ప్రాంతాల్లో లభిస్తుంది. ముఖ్యంగా గోదావరి నదిలో, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది. అయితే, గోదావరి పులసకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇది సహజసిద్ధమైన వాతావరణంలో మాత్రమే పెరుగుతుంది. కృత్రిమంగా పెంచడం సాధ్యం కాదు. సముద్రంలో పెరుగుతూ, సంతానోత్పత్తి కోసం నదులలోకి ప్రవేశించే ఈ చేపలు దొరకడం చాలా కష్టం. మత్స్యకారులు ఈ చేపల కోసం ప్రత్యేకంగా వేచి చూస్తుంటారు. దొరికిన వెంటనే వేలం పాటలు నిర్వహిస్తుంటారు. కొన్నిసార్లు ఒక కిలో పులస చేప రూ. 15,000 నుండి రూ. 24,000 వరకు కూడా ధర పలుకుతుంది.
ఆరోగ్యపరంగా పులస చేప చాలా ప్రయోజనకరమైనది. ఇది ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఒక నూనె చేప.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మంటను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను నివారిస్తాయి. అలాగే, పులస చేపలో విటమిన్ డి, విటమిన్ బి12, ఫాస్పరస్, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, శరీరంలోని వివిధ రకాల జీవక్రియలకు సహాయపడతాయి. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఎంపిక.
పులస చేప కేవలం వర్షాకాలంలో, ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే లభిస్తుంది. ఈ సమయంలో గోదావరి నదిలో వరదలు వచ్చి, నీరు ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడు సముద్రం నుండి పులస చేపలు గుడ్లు పెట్టడం కోసం ఎదురీదుకుంటూ నదిలోకి వస్తాయి. వర్షాకాలం తగ్గి, నదిలో నీటి ప్రవాహం తగ్గిన తర్వాత, గుడ్లు పెట్టిన పులస చేపలు తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఈ అరుదైన లభ్యత, సీజనల్ డిమాండ్ కారణంగానే పులస చేపకు అంతటి అధిక ధర, క్రేజ్ ఉంటుంది. పర్యావరణ కాలుష్యం, అధిక వేట వంటి కారణాల వల్ల ఈ చేపల సంఖ్య ఇటీవల తగ్గుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Dragon fruit milk shake : డ్రాగన్ ప్రూట్‌తో హై రిచ్ ప్రోటీన్ మిల్క్ షేక్ చేసుకోవడం ఎలా?