Children Food: పిల్లలు పాలు తాగే దశ నుండి ఘనాహారం తినే దశకు మారడం వారి ఎదుగుదలలో చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే ఇదే సమయం తల్లిదండ్రులకు అత్యంత ఒత్తిడితో కూడుకున్నదిగా మారుతుంది. పిల్లాడు తినేటప్పుడు దగ్గినా, వింత శబ్దాలు చేసినా లేదా ముఖం అలా పెట్టినా.. ఎక్కడ గొంతులో అడ్డం పడిందో అని పేరెంట్స్ భయపడిపోతుంటారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రతిసారీ దగ్గు రావడం లేదా వాంతి వచ్చినట్లు అవ్వడం ‘చోకింగ్’ కాదు.
చాలా సార్లు అది కేవలం ‘గాగింగ్’ మాత్రమే. ఇది శరీరం చూపే ఒక సాధారణ, రక్షణ ప్రతిక్రియ. గాగింగ్, చోకింగ్ మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. ఈ తేడాను సరిగ్గా గుర్తిస్తే, తల్లిదండ్రులు అనవసరమైన ఆందోళన నుండి బయటపడవచ్చు. అవసరమైనప్పుడు సరైన చర్యలు తీసుకోవచ్చు.
గాగింగ్ అంటే ఏమిటి?
గాగింగ్ అనేది శరీరం సహజ రక్షణ యంత్రాంగం. పిల్లాడు ఘనాహారం తీసుకోవడం నేర్చుకుంటున్నప్పుడు ఆహారం గొంతులోకి లోపలికి వెళ్ళకముందే ఈ రిఫ్లెక్స్ దానిని బయటకు నెట్టడానికి సహాయపడుతుంది.
లక్షణాలు: గట్టిగా దగ్గడం, శబ్దంతో వాంతి వచ్చినట్లు అవ్వడం, కళ్లలో నీళ్లు తిరగడం, ముఖం ఎర్రబడటం, నాలుక బయటకు రావడం వంటివి కనిపిస్తాయి.
Also Read: భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?
నిపుణుల సలహా: ఈ లక్షణాలు భయానకంగా అనిపించినప్పటికీ చాలా సందర్భాలలో పిల్లాడు స్వయంగా దానిని సర్దుబాటు చేసుకుంటాడు. అటువంటప్పుడు తల్లిదండ్రులు కంగారుపడి పిల్లల నోటిలో వేలు పెట్టకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆహారం ఇంకా లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది.
చోకింగ్ అంటే ఏమిటి?
చోకింగ్ అనేది ఒక తీవ్రమైన పరిస్థితి. ఏదైనా పదార్థం పిల్లల శ్వాసనాళాన్ని అడ్డుకున్నప్పుడు, వారు సరిగ్గా శ్వాస తీసుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది.
లక్షణాలు: పిల్లాడు ఏడవలేడు లేదా దగ్గలేడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాడు. చర్మం నీలం లేదా తెల్లగా మారుతుంది. నోటి నుండి శబ్దం రాదు. ముఖం భయాందోళనతో కనిపిస్తుంది.
పిల్లలకి గొంతులో అడ్డం పడితే ఏం చేయాలి?
ఒకవేళ ఏడాది లోపు పిల్లాడికి గొంతులో ఏదైనా అడ్డం పడితే పిల్లాడిని మీ చేతిపై బోర్లా పడుకోబెట్టండి. తల, మెడకు సపోర్ట్ ఇవ్వండి. ఆపై రెండు భుజాల మధ్య ఐదు సార్లు మెల్లగా తట్టండి. ఒకవేళ ఆ పదార్థం బయటకు రాకపోతే పిల్లాడిని వెల్లకిలా తిప్పి చాతిపై ఐదుసార్లు నొక్కండి. అవసరమైతే ఈ దశలను పునరావృతం చేస్తూ వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లల కోసం CPR, Choking First Aid శిక్షణ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
చోకింగ్ ముప్పును తగ్గించడానికి జాగ్రత్తలు
- పిల్లలను ఎప్పుడూ తిన్నగా కూర్చోబెట్టి ఆహారం తినిపించాలి.
- తినేటప్పుడు ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలి.
- ద్రాక్ష పండ్లు, నట్స్, హార్డ్ క్యాండీ లేదా మీట్ వంటి పదార్థాలను చిన్న చిన్న మెత్తని ముక్కలుగా చేసి ఇవ్వాలి.
- పిల్లల వయస్సును బట్టి ఆహార ఆకృతిని మార్చాలి.
- పడుకున్న పిల్లలకు ఎప్పుడూ ఆహారం తినిపించకూడదు.
పిల్లలు ఘనాహారం మొదలుపెట్టినప్పుడు.. నమలడం, ఆహారాన్ని నోటిలో కదపడం, సురక్షితంగా మింగడం నేర్చుకుంటారు. ఈ క్రమంలో గాగింగ్ అనేది సర్వసాధారణం. సరైన సమాచారం ఉంటే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండగలరని, చోకింగ్ లక్షణాలను గుర్తించడం ప్రాణాలను కాపాడే చర్యగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
