Bulletproof Coffee : రోజూ ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకూ చాలా మందికి టీ, కాఫీ తాగడం ఒక అలవాటుగా మారింది. ఇందులో కొందరు టీ ప్రేమికులు అయితే, మరికొందరు కాఫీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. ఈ కాఫీ ప్రియుల్లో చాలామంది బ్లాక్ కాఫీని ప్రత్యేకంగా ఇష్టపడతారు. అయితే ఇటీవల బ్లాక్ కాఫీలో చిన్న మార్పు చేసి, ఆరోగ్యాన్ని మెరుగుపర్చే విధానంగా నెయ్యి కలిపిన కాఫీ లేదా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనే పేరుతో ఓ కొత్త ట్రెండ్ ఏర్పడింది.
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే ఏమిటి?
బ్లాక్ కాఫీలో ఒక స్పూన్ దేశీ నెయ్యిని కలిపి తాగడమే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. ఇందులో చక్కెర, పాలు కలపరు. ఈ కాఫీని ఉదయం ఖాళీ పొట్టుపై తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
శక్తిని పెంచే మిశ్రమం
ఈ కాఫీలో నెయ్యి కలిపితే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది మాంద్యం లేకుండా, రోజంతా ఉత్తేజంగా ఉండేందుకు సహాయపడుతుంది. సాయంత్రానికి వచ్చే అలసట, నీరసం తగ్గుతుంది. పనిచేసే సామర్థ్యం మెరుగవుతుంది. నిరంతరం చురుకుగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.
భోజనం తక్కువ, ఆకలి నియంత్రణ
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగిన తరువాత ఆకలి త్వరగా వేయదు. దీనివల్ల అధికంగా తినే అవసరం ఉండదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారి కోసం గొప్ప పరిష్కారం. అల్పాహారం తగ్గించి, శరీరంపై ఒత్తిడి లేకుండా బరువు తగ్గించుకోవచ్చు.
మెటబాలిజం మెరుగవుతుంది
ఈ కాఫీ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. శరీరంలోని కొవ్వు వేగంగా కరిగేందుకు దోహదం చేస్తుంది. క్యాలరీల వినియోగం పెరుగుతుంది. ఇది ప్రత్యేకంగా అధిక బరువు ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ తీసుకుంటే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు లభించవచ్చు.
పోషకాలు, విటమిన్ల సమృద్ధి
. నెయ్యిలో విటమిన్ A, D, E, K లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని శరీరం కాఫీతో తీసుకున్నప్పుడు సులభంగా శోషించుకుంటుంది.
. విటమిన్ A వల్ల కంటి చూపు మెరుగవుతుంది.
. విటమిన్ D తో ఎముకలు బలపడతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
. విటమిన్ E చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ముడతలు తగ్గుతాయి.
. విటమిన్ K వల్ల గాయాలప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది.
. మెదడు ఆరోగ్యానికి మేలు
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీని వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మానసిక స్థైర్యం, ఉత్తేజం లభిస్తుంది.
ఎటువంటి జాగ్రత్తలు అవసరం?
ఈ మిశ్రమం అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఫుడ్ అలర్జీలు ఉన్నవారు దీన్ని తీసుకునే ముందు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పేగు సమస్యలు ఉన్నవారు, నెయ్యికి అలెర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. నిత్యం ఒక కప్పు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగడం వల్ల శరీరానికి శక్తి, ఆరోగ్యానికి మేలు, చురుకుతనానికి తోడ్పాటు లభిస్తుంది. అయితే ప్రతి ఒక్కరి శరీర రీతికి అనుగుణంగా ఈ మిశ్రమం ఉపయోగపడుతుందా లేదా అన్నదాన్ని ఒకసారి పరిశీలించుకోవడం మేలుగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఇది ఓ చిన్న మార్పు అయినా, దీని ప్రభావం గణనీయంగా ఉండవచ్చు.