Thamalapaku Rasam : ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో తమలపాకు మొక్కకూడా ఒకటి. నాన్ వెజ్, బిర్యానీలు తిన్నప్పుడు తమలపాకుతో ఒకే ఒక స్వీట్ కిళ్లీ వేసుకున్నా.. తమలపాకులో కొద్దిగా సున్నం వేసుకుని తిన్నా.. త్వరగా అరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే బుతుక్రమం సరిగ్గా రాని వారు కూడా.. తమలపాకును తింటే.. రుతుక్రమం వస్తుందని అంటారు.
అయితే.. మనం అన్నంలో తినడానికి టమాటో రసం, చింతపండు చారు ఎలా చేసుకుంటామో తమలపాకుతో కూడా రసం తయారు చేసుకుని తినొచ్చు. అజీర్తి, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం, శరీరంలో నలతగా ఉన్నప్పుడు తమలపాకు రసం తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుందట. తమలపాకుతో ఈ రసాన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతోమేలు చేస్తుంది. మరి అంత ఆరోగ్యకరమైన తమలపాకు రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. తెలుసుకుందాం.
తమలపాకు రసం తయారీకి కావలసిన పదార్థాలు
తమలపాకులు – 7 నుంచి 8
నాటు టమాటాలు -3
తరిగిన కొత్తిమీర – గుప్పెడు
ఉప్పు – రుచికి సరిపడా
రసం పొడి – ఒక టేబుల్ స్పూన్
నీళ్లు – 600 ఎంఎల్
పసుపు – అర టీ స్పూన్
మిరియాల పొడి – 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు – 2 రెమ్మలు
తాలింపుకు..
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – అర టీ స్పూన్
ఇంగువ – చిటికెడు
ఎండుమిర్చి – 4
వెల్లుల్లి రెబ్బలు – 4
తమలపాకు రసం తయారీ విధానం
ముందు ఒక మిక్సీ జార్ ను తీసుకుని తమలపాకులను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి.. మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుకుంటూ 12-15 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి వేడి చేసుకుని.. తాలింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత.. అందులో రసం వేసి కలుపుకుని సర్వ్ చేసుకుంటే.. వేడివేడి తమలపాకు రసం రెడీ. అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ రసం చేసుకుని తింటే.. త్వరగా ఉపశమనం ఉంటుంది.
Also Read : Jaggery: చక్కెరకు బదులుగా బెల్లం వాడితే మంచిదా..?