Moringa Ladoo : ఈ మధ్యకాలంలో మునగాకు, మునగ కాయలతో వెరైటీ వంటకాలను తయారు చేసుకునే వారి సంఖ్య బాగానే పెరిగింది. తాజాగా మునగ లడ్డూలపై బాగా చర్చ జరుగుతోంది. వీటిని తింటే జుట్టు రాలే సమస్య, గోళ్లు పొడిబారే సమస్య మటుమాయం అవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మునగ లడ్డూలను ఎలా తయారు చేయాలి ? వాటితో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :WhatsApp Video Calls : వాట్సాప్ వీడియో కాల్స్‌లో సరికొత్త ఫీచర్లు ఇవే
మునగ లడ్డూల తయారీకి 2 టేబుల్ స్పూన్ల మునగాకు పొడి(Moringa Ladoo) కావాలి. అందులో కలుపుకునేందుకు 1/3 కప్పు గుమ్మడి గింజలు, 1/3 కప్పు పిస్తా గింజలు, 2/3 కప్పు కొబ్బరి పొడి, 2 యాలకులు, 3/4 కప్పు కిస్‌మిస్ కావాలి. తొలుత కొబ్బరి పొడి, పిస్తా గింజలు, గుమ్మడి గింజలు, కిస్‌మిస్‌లను కడాయిలో దోరగా వేయించాలి. వీటన్నింటికి రెండు యాలకులు, మునగాకు పొడి కలిపి మిక్సీ పట్టాలి. ఇలా వచ్చే మిక్చర్‌ను ఉండల్లా చేస్తే మునగ లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూను ప్రతిరోజు ఒకటి చొప్పున తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ లడ్డూ తయారీకి వాడే కొబ్బరి పొడి వల్ల కొన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయి. కొబ్బరి పొడిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మన జుట్టు, గోళ్లకు మంచి పోషణను అందిస్తాయి. పిస్తా గింజల వల్ల బయోటిన్, విటమిన్-ఈ, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. మన జుట్టు కుదుళ్లను ఈ పోషకాలు చాలా స్ట్రాంగ్ చేస్తాయి. కిస్మిస్ ద్వారా మన శరీరానికి ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వెరసి మునగాకు లడ్డూ వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందుకోవచ్చు.