Hasta Mudras: హస్త ముద్రలు (Hasta Mudras) అనేవి చేతి వేళ్ల విభిన్న కదలికలు. ఇవి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. భారతదేశంలోని ప్రాచీన పద్ధతుల్లో ఒకటైన యోగా, ధ్యానం వంటి వాటిల్లో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. తాజాగా అయోధ్యలోని దశరథ సమాధి స్థలంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా హస్త ముద్రల ప్రాముఖ్యతను పర్యాటకులు తెలుసుకునేందుకు వీలుగా 30 విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు అయోధ్య వికాస ప్రాధికార సంస్థ ఉపాధ్యక్షుడు అశ్వినీ కుమార్ పాండే తెలిపారు.
హస్త ముద్ర అంటే ఏమిటి?
హస్త ముద్రలు అంటే చేతుల సంకేతాలు లేదా ముద్రలు. వీటి ప్రధాన ఉద్దేశ్యం శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించి, వాటిని ఆరోగ్యంగా ఉంచడం. ఆయుర్వేదంలో చికిత్సా పద్ధతిలో భాగంగా కూడా ఈ ముద్రలను ఉపయోగిస్తారు. ప్రతి ముద్రకు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. వీటిని అభ్యసించడం కూడా చాలా సులువు.
Also Read: AP Government: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ!
ప్రధాన హస్త ముద్రలు, వాటి ప్రయోజనాలు
జ్ఞాన ముద్ర: ఈ ముద్రలో బొటనవేలు, చూపుడు వేలును కలిపి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. బుద్ధి వికాసానికి సహాయపడుతుంది.
వాయు ముద్ర: బొటనవేలు సహాయంతో చూపుడు వేలును నొక్కాలి. ఇది శరీరంలోని వాత దోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
అగ్ని ముద్ర: ఈ ముద్రలో బొటనవేలుతో ఉంగరపు వేలును నొక్కాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జల ముద్ర: చిన్న వేలును బొటనవేలు సహాయంతో నొక్కాలి. ఈ ముద్ర శరీరంలో నీటి కొరతను తీరుస్తుంది.
శూన్య ముద్ర: బొటనవేలు, మధ్య వేలును నొక్కాలి. వినికిడి లేదా చెవి సమస్యలు ఉన్నవారికి ఈ ముద్ర చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
హస్త ముద్రల వల్ల కలిగే ప్రయోజనాలు
- ఆయుర్వేదంలో హస్త ముద్రలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ధర్మగురువులు సైతం శాంతి, ధ్యానం కోసం వీటిని ఉపయోగిస్తారు.
- ధ్యానాన్ని కేంద్రీకరించడంలో సహాయపడుతుంది.
- శరీరంలో శక్తి ప్రవాహం సక్రమంగా జరిగేలా చేస్తుంది.
- శరీరంలోని అన్ని చక్రాలను సక్రియం చేస్తుంది.
- ప్రాణాయామం చేయడంలో కూడా హస్త ముద్రలు ప్రయోజనకరంగా ఉంటాయి.
ముద్రలు చేయడానికి సరైన సమయం
హస్త ముద్రలను అభ్యసించడానికి ఉదయం పూట ఉత్తమ సమయం. ప్రతి ముద్రను 10 నుంచి 12 నిమిషాల పాటు చేయడం మంచిది. ఈ హస్త ముద్రలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.