Lemon for Health : వర్షాకాలం మొదలవుతున్న వేళ, జలుబు, ఫ్లూ లాంటి వైరల్ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడే పదార్థాలు అత్యంత అవసరం. అలాంటి వాటిలో ముందువరుసలో ఉండేది నిమ్మకాయ. ఇది కేవలం రుచికరమైన పదార్థం మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది. అయితే, దీన్ని ఎలా, ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది తెలియకపోతే, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
విటమిన్ సి కు అద్భుతమైన మూలం
నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జలుబు, ఫ్లూ లాంటి వైరస్‌లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం తేలికపాటి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా శక్తిని కూడా ఇస్తుంది.
జీర్ణక్రియకు తోడు, బరువు తగ్గడంలో మేలు
నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు ఉండే వారికి ఇది ఉపశమనం కలిగించవచ్చు. అలాగే, నిమ్మకాయ మెటబాలిజాన్ని పెంచుతుందని పలుఅధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది కొవ్వు కాల్చడంలో సహాయపడటంతో బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తమ ఆహారంలో చేర్చడం మంచిది.
డీటాక్స్‌కు తోడు చర్మానికి మెరుపు
నిమ్మరసం శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. నిమ్మరసం పీల్చడం వల్ల చర్మం మీద ప్రభావం బాగా కనిపిస్తుంది.
అపాయం కూడా ఉందా?
అవును. ఎంత మేలైనా, మితి దాటి ఉంటే విషమే. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ దంతాలపై ప్రభావం చూపుతుంది. ఇది దంత ఎనామెల్‌ను దెబ్బతీసి, దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. అందువల్ల నిమ్మరసం తాగిన తర్వాత నోటిని పుక్కలించడం లేదా స్ట్రా ఉపయోగించడం ఉత్తమం. అలాగే, ఎసిడిటీ లేదా గుండెల్లో మంట వంటి సమస్యలున్నవారు నిమ్మరసం ఎక్కువగా తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకుంటే పెప్సిన్ అనే ఎంజైమ్ యాక్టివ్ అయి గుండెల్లో మంటను మరింత పెంచుతుంది.
మూత్ర విసర్జన పెరగడం, నీటి లోపం
నిమ్మకాయ ఎక్కువగా తీసుకుంటే పదేపదే మూత్రం రావచ్చు. దీని వల్ల శరీరంలో నీటి తక్కువతనంతో పాటు ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. కొంతమందిలో దీర్ఘకాలంగా ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇందులో కొంత మోతాదులో ఆక్సలేట్ కూడా ఉంటుంది.
ఎముకల బలాన్ని తగ్గించవచ్చా?
కొన్ని పరిశోధనల ప్రకారం, నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే ఎముకల దృఢత తగ్గే అవకాశముందని తెలియజేశారు. ఇది ముఖ్యంగా పొట్టిలో ఉన్న పిహెచ్‌ను మార్చడం వల్ల జరుగుతుంది.
ఎలా తీసుకోవాలి?
నిపుణుల సూచన ప్రకారం, నిమ్మరసాన్ని బాగా వేడి ఆహారంలో కలపకూడదు. కారణం, విటమిన్ సి వేడి వల్ల నాశనం అవుతుంది. అందువల్ల వంట పూర్తయిన తర్వాత లేదా చల్లారిన ఆహారంలో కలపడం మంచిది. పప్పు, ఆకుకూరల వంటి వాటిలో నిమ్మరసం కలపడం వల్ల ఐరన్ శోషణ మెరుగవుతుంది.
తగిన మోతాదులో తీసుకోవడమే సరైన మార్గం
నిమ్మకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. కానీ దీన్ని ఆలోచించి, మితంగా తీసుకోవాలి. శరీర స్పందనను గమనించాలి. ఏదైనా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. చివరగా, ఆరోగ్యకరమైన ఆహారం అంటే — మితిమీరి తీసుకునే ఆహారం కాదు, సమతుల్యంగా తీసుకునే ఆహారమే.