Identify Adulterated Food : కల్తీ ఆహారాన్ని ఇలా గుర్తించండి..!

పాలు (Milk), టీ పొడి (Tea Powder), కారం (Chilli Powder), మసాలా దినుసులు (Spices), తేనె (Honey)

ఈ రోజుల్లో ఆహార పదార్థాలలో కల్తీ బాగా జరుగుతోంది. పాలు (Milk), టీ పొడి (Tea Powder), కారం (Chilli Powder), మసాలా దినుసులు (Spices), తేనె (Honey) ఇలా చాలా వరకు ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీల గురించి మనం మీడియాలో తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ కల్తీ ఆహారం (Adulterated Food) తీసుకోవడం వల్ల అనేక అనారోగ్యాలతో పాటు, దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం కల్తీ అవుతుందని తిండి తినకుండా ఉండలేం. కల్తీ అయిన ఆహార పదార్థాలను మనం గుర్తిస్తే ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. మన ఇంట్లోనే సులభంగా కల్తీ ఆహారాన్ని (Adulterated Food) గుర్తించవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం..

తేనె (Honey):

మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. తేనె ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. హెల్బల్‌ టీలలో తేనె వేసుకుని తాగుతూ ఉంటాం. కానీ తేనె కల్తీదైతే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడే అవకాశం ఉంది. తేనె స్వచ్ఛమైనదా? కల్తీ అయిందా అని తెలుసుకోవాలంటే.. చాలా సింపుల్‌ ట్రిక్‌ ఉంది. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని 1 టీస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. స్వచ్ఛమైన తేనె గ్లాసు దిగువన నీటి కింద స్థిరపడుతుంది. ఏదైనా స్వీటెనర్‌‌/ పదార్ధంతో తేనెను కల్తీ చేస్తే, అది నీటిలో కలుస్తుంది.

మిరియాలు (Pepper):

నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిరియాలు నిజమైనవా? కల్తీ అయ్యాయా అని గురించడానికి.. ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ నల్ల మిరియాలు వేసి కలపండి. అసలైన మిరియాలు.. నీటి కిందకు వెళ్లి స్థిరపడతాయి. కల్తీవి నీటిపై తేలుతూ ఉంటాయి.

లవంగాలు (Cloves):

శీతాకాలంలో, లవంగాలు జలుబు, దగ్గు నుంచి రక్షిస్తాయి. కానీ కల్తీ లవంగాలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లవంగాల్లో కల్తీని గుర్తించడానికి.. ఒక గ్లాస్‌ నీరు తీసుకుని వాటిలో 1 టీస్పూన్‌ లవంగాలు వేయండి. అసలైన లవంగాలు.. నీటిలో మునుగుతాయి. కల్తీ లవంగాలు నీటి పై తేలతాయి.

ఇంగువ (Asafoetida):

ఇంగువను పులిహోర, పప్పు తాలింపులో వేస్తూ ఉంటాం. ఇంగువ జీర్ణక్రియ సమస్యలకు చెక్‌ పెడుతుంది. ఇంగువ స్వచ్ఛతను గుర్తించడానికి. ఒక స్టీల్‌ స్పూన్‌లో కొద్దిగా ఇంగువ వేసి మంట మీద పెట్టండి. అసలైన ఇంగువ.. మంటలో కర్పూరంలా మండుతుంది. కానీ నకిలీది.. సరిగ్గా మండదు.

కొబ్బరి నూనె (Coconut Oil):

కల్తీ కొబ్బరి నూనెను గుర్తించడానికి.. దాన్ని ఫ్రిజ్‌ లోపల ఉంచాలి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె.. ఫ్రిజ్‌లో పెడితే గడ్డ కడుతుంది. కల్తీది అడుగుభాగంలో గడ్డకట్టి.. పైన నూనె తేలుతూ ఉంటుంది. కొబ్బరి నూనెను ఫ్రీజర్‌లో కాకుండా ఫ్రిజ్‌లో ఉంచాలని గుర్తుంచుకోండి.

శెనగ పిండి (Chickpea Flour):

శెనగపిండిలో రంగు రావడానికి మిఠాయి రంగు పొడిని కలిపి కల్తీ చేస్తున్నారు. ఇది తీసుకుంటే.. ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉంది. కొద్దిగా శెనగపిండిలో నీళ్లు పోసి కలిపితే, ఆ నీళ్లు ఎరుపు రంగులోకి మారితే,కల్తీ జరిగినట్లు అని అర్థం చేసుకోవాలి.

బెల్లం (Jaggery):

బెల్లంలో మెటానిల్ పసుపు రంగు కలిపి కల్తీ చేస్తుంటారు. ఆ బెల్లాన్ని నీళ్లలో వేసి కరిగిస్తే,మంచి నీటిలో కరిగిపోతుంది. అడుగున కల్తీ బెల్లం తెట్టులా తేలుతుంది.

నెయ్యి (Ghee):

వెన్న లేదా నెయ్యిలో కొద్దిగ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌, పంచదార మిశ్రమాన్ని కలిపి ఐదు నిమిషాల తర్వాత అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగిందని అర్థం.

కందిపప్పు (Toor Dal):

కందిపప్పులో హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ కలిపితే,అది ఎరుపు రంగులోకి మారితే.. అప్పుడు అది కల్తీ జరిగినట్లు తెలుసుకోవాలి.

Also Read:  Easy Weight Loss : ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా?