Bananas : ఏ కాలమయినప్పటికీ సులభంగా లభించే పండ్లలో అరటి పండు మొదటిది. ధర తక్కువ, పోషకాలు అధికంగా ఉండటం వల్ల దాదాపు ప్రతి ఒక్కరూ దీన్ని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. అరటి పండు తినడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి వంటి మూలకాలు అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటి పండ్లు సాధారణంగా ఓ పండులో సుమారు 105 క్యాలరీల శక్తిని కలిగి ఉంటాయి. అందులో 14 గ్రాముల వరకు సహజ చక్కెరలు ఉంటాయి. అయితే, ఈ చక్కెరలు ఫైబర్ వల్ల నెమ్మదిగా రక్తంలో కలుస్తాయి. దాంతో రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు కూడా ఒకటి లేదా రెండు పండ్లు మితంగా తింటే ఎటువంటి హానీ ఉండదు. కానీ మోతాదుకు మించి తింటే మాత్రం షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
Read Also: RBI Governor : అమెరికా సుంకాలు పెంచినా.. భారతకు టెన్షన్ లేదు
పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం, సాధారణ శారీరక శ్రమ చేసే వారు రోజుకు 1–2 అరటి పండ్లను తినొచ్చు. ఎక్కువ వ్యాయామం చేసే వారు అయితే 2–3 పండ్ల వరకు తీసుకోవచ్చు. చిన్న అరటి పండ్లు అయితే రెండు, పెద్ద సైజు అరటిపండు అయితే ఒకటి సరిపోతుంది. ఇక, వ్యాయామానికి ముందు అరటిపండు తినడం మంచిది. అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. అరటిపండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. ఇది ద్రవాల సమతుల్యతను నిలుపుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా హై బీపీ ఉన్నవారు రోజుకు ఒక అరటిపండు తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హార్ట్ అటాక్‌ను కూడా అడ్డుకుంటుంది.
ఇంకా, అరటిపండులో ఉండే ఫైబర్ కారణంగా ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రీబయోటిక్ ఆహారంగా పని చేస్తుంది. అంటే జీర్ణవ్యవస్థలో ఉండే మంచిబ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగవుతుంది. విటమిన్ B6 అరటిపండులో అధికంగా లభిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు రోజూ అరటిపండు తింటే మంచి ఫలితం పొందవచ్చు. అంతేకాకుండా మెటబాలిజం మెరుగవుతుంది. నాడీ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. విటమిన్ C కూడా అరటిపండులో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మాంగనీస్ మూలకం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. దాంతో చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారు అరటిపండును మితంగా తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో ఎక్కువ కాలం ఆకలి వేయదు. దీనివల్ల రోజూ తినే ఆహారం పరిమితమవుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే అరటి పండ్లు మోతాదుకు మించి తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే పొటాషియం అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు ఒకటి లేదా గరిష్ఠంగా రెండు పండ్లు మితంగా తినడం ఉత్తమం. పుష్కలమైన లాభాలు పొందాలంటే అరటిపండ్లను యాపిల్, బొప్పాయి, నారింజ, ద్రాక్ష వంటి ఇతర పండ్లతో కలిపి ఫ్రూట్ సలాడ్‌లా తింటే ఇంకా మెరుగైన పోషకాలు లభిస్తాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా శరీరానికి చేరతాయి. కాగా, అరటిపండ్లు ఆరోగ్యానికి అద్భుతమైన పండ్లు. కానీ అవి కూడా మితంగా తినడం తప్పనిసరి. రోజూ ఒకటి లేదా రెండు అరటిపండ్లను ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు అంది, ఆరోగ్యంగా ఉండవచ్చు.