అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

ఆలిన్ భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లినా తన అవయవాల ద్వారా నలుగురు వ్యక్తుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఆమె చేసిన అవయవ దానం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు పునర్జన్మను ఇచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Organ Donation

Organ Donation

Organ Donation: కేరళకు చెందిన 10 నెలల పసిపాప ఆలిన్ షెరిన్ అబ్రహం గొప్ప మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన అవయవ దాతగా ఆలిన్ రికార్డు సృష్టించింది. ఈ చిన్నారి పార్థివ దేహాన్ని మొదట మల్లపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఆ తర్వాత వెస్ట్ వాలుమ్మనిల్‌లోని ఆమె నివాసానికి చివరి చూపు కోసం తీసుకురాగా సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. పూర్తి అధికారిక లాంఛనాలతో ఆ చిన్నారి అంత్యక్రియలు నిర్వహించారు.

ఆలిన్ భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లినా తన అవయవాల ద్వారా నలుగురు వ్యక్తుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఆమె చేసిన అవయవ దానం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు పునర్జన్మను ఇచ్చింది. అవయవ దానం, ట్రాన్స్‌ప్లాంటేషన్ అసలు శక్తి ఇదే. అసలు ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అవయవ దానం అంటే ఏమిటి?

ఆరోగ్య సమాచారాన్ని అందించే వెబ్‌సైట్ ‘clevelandclinic’ ప్రకారం.. అవయవ దానం అనేది ఒక వ్యక్తికి చెందిన ఆరోగ్యకరమైన అవయవాన్ని తీసుకుని, అవయవ వైఫల్యంతో బాధపడుతున్న మరొక రోగి శరీరంలో అమర్చే ప్రక్రియ. ఇది అత్యంత సున్నితమైన, సమయంతో కూడుకున్న వైద్య ప్రక్రియ. సాధారణంగా ఇందులో రెండు శస్త్రచికిత్సలు దాదాపు ఒకే సమయంలో జరుగుతాయి. ఒకటి దాత శరీరం నుండి అవయవాన్ని సేకరించడం, రెండోది అవసరమైన రోగి శరీరంలో దానిని అమర్చడం.

Also Read: ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

అవయవ దానం ఎన్ని రకాలు?

అవయవ దానం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. మరణానంతరం చేసే దానం. జీవించి ఉన్న వ్యక్తి చేసే దానం.

మరణానంతరం: మెదడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరిస్తారు. మరణం తర్వాత గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, క్లోమం, ప్రేగుల వంటి అవయవాలను దానం చేయవచ్చు. ఇవే కాకుండా కళ్ళు, చర్మం, ఎముక మజ్జ కూడా దానం చేయవచ్చు.

జీవించి ఉన్నప్పుడు: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండి తన అవయవం రోగికి సరిపోతుందంటే.. కిడ్నీ వంటి కొన్ని అవయవాలను ప్రాణాలతో ఉండగానే దానం చేయవచ్చు.

ఎవరు దాత కావచ్చు?

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. దాదాపు ప్రతి ఒక్కరూ అవయవ దాతలు కావచ్చు. ఇక్కడ వయస్సు కంటే అవయవాల ఆరోగ్యం, వైద్య పరీక్షల ఫలితాలే ముఖ్యం. సరైన సమయంలో తీసుకునే ఒక నిర్ణయం ఎంతో మందికి పునర్జన్మను ఇస్తుంది.

అవయవ దానం, ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ అంత సులభం కాదు. ఇది అనేక దశల గుండా సాగుతుంది. దానం చేయాలనే నిర్ణయంతో మొదలై, విజయవంతమైన శస్త్రచికిత్సతో ముగుస్తుంది. మరణానంతర అవయవ దానంలో సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మరణించిన కొన్ని గంటల్లోనే అవయవాలను సురక్షితంగా బయటకు తీయాలి. ఆలస్యమైతే ఆ అవయవాలు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అదే జీవించి ఉన్న దాతల విషయంలో అయితే.. ముందస్తు ప్రణాళికతో, ఆరోగ్య పరీక్షలు, అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటించి ప్రక్రియను పూర్తి చేస్తారు.

  Last Updated: 19 Feb 2026, 10:17 PM IST