Site icon HashtagU Telugu

Hiccups: ఎక్కిళ్లు ఎన్నో అనర్థాలకు సూచన. అప్రమత్తంగా ఉండాల్సిందే!

Hiccups Are A Sign Of Many Misfortunes Be Alert!

Hiccups Are A Sign Of Many Misfortunes Be Alert!

తరచుగా ఎక్కిళ్లు (Hiccups) వస్తున్నాయా? ఏదైనా అవాక్కయ్యే విషయంతో ఆగిపోతున్నాయా? చాలా సందర్భాల్లో ఎక్కిళ్ల వల్ల చికాకు తప్ప పెద్ద నష్టమేమీ ఉండదు. అంతేకాదు ఎక్కిళ్లకు పెద్ద కారణం కూడా ఉండదు. అయితే కొందరిలో ఒత్తిడి, బలమైన భావోద్వేగాలు, అత్యుత్సాహం, తింటున్నపుడు, తాగుతున్నపుడు ఎక్కిళ్లు వస్తుంటాయి. ఇవేవీ కూడా ప్రమాదానికి సూచికలు కాకపోవచ్చు, కానీ రెండు రోజులకు మించి ఎక్కిళ్లు వేధిస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తేలిక పాటి ఛాతి నొప్పితో ఎక్కిళ్లు (Hiccups) వస్తుంటే మాత్రం అది స్ట్రోక్ రావడానికి ముందస్తు సంకేతం కావచ్చట. ఇది ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ అని అంటున్నారు.

స్ట్రోక్:

మెదడు వెనుక ఒక భాగంలో వచ్చే స్ట్రోక్ తో ఎక్కిళ్లకు సంబంధం ఉంటుంది. అలాంటి స్ట్రోక్ మహిళల్లో ఎక్కువగా వస్తుందట. 2015 లో జరిగిన ఒక అధ్యయనంలో ప్రతి 10 మంది స్ట్రోక్ బారిన పడిన మహిళల్లో తొమ్మిది మందికి ఇలా ఎక్కిళ్లు వచ్చినట్లు తెలిపారు. ఇలా ఎక్కిళ్లు వచ్చే లక్షణం కొన్ని సార్లు మహిళల్లో గుండె సమస్యలు లేదా అజీర్ణం వల్ల కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

స్ట్రోక్ అనేది మెదడులో వచ్చే ప్రాణాంతక సమస్య. మెదడులో కొంత భాగానికి రక్త ప్రసరణ నిలిచిపోవడం వల్ల వచ్చే సమస్య. రక్తం నిరంతరం ప్రసరణ జరగకపోతే మెదడులోని ఆ భాగంలో కణాలు మరణించవచ్చులేదా దెబ్బతినవచ్చు. స్ట్రోక్ వల్ల శరీరంలో ఒకవైపు బలహీన పడవచ్చు. లేదా తిమ్మిరిగా అనిపించవచ్చు, కొన్ని సార్లు మాట్లాడడంలో ఇబ్బంది కలుగవచ్చు. లేదా అకస్మాత్తుగా దృష్టి లోపం ఏర్పడవచ్చు. ఇలా ఏదైనా జరిగే ఆస్కారం ఉంటుంది.

లివర్ లేదా కిడ్నీ క్యాన్సర్:

చాలా అరుదుగా లివర్ లేదా కిడ్నీ క్యాన్సర్ వల్ల కూడా ఆగకుండా ఎక్కిళ్లు రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ తో బాధ పడే వారికి నిరంతరం ఎక్కిళ్లు రావచ్చని యూకే కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ చెబతోంది. క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో జీర్ణాశయం పనిచెయ్యడం మానేస్తుంది. పరిమాణం పెరిగిపోయి ఉబ్బరంగా తయారవుతుంది. అంతేకాదు వారికి ఆహార నాళం, ఛాతి భాగంలో ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. క్యాన్సర్ వల్ల డయాఫ్రం మీద ఒత్తిడి పెరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు.

కిడ్నీ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల వారి బ్లడ్ కెమిస్ట్రీ మారిపోతుంది. వీరికి రక్తంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిని హైపర్కాల్కేమియా అంటారు. లివర్, కిడ్నీ క్యాన్సర్లతో బాధపడుతున్న వారిలో 4 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయట. లివర్ క్యాన్సర్ లో ఆకలి మందగిండచం, బరువు తగ్గిపోవడం, నీరసంగా ఉండడం, చర్మం పసుపు రంగుకు మారిపోవడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. కిడ్నీ క్యాన్సర్ లో మూత్ర విసర్జనలో రక్తం కనిపించడం, నడుము లేదా వీపు నొప్పి, అలసట, ఆకలి మందగించడం, అదుపులోనే బీపీ వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి.

Also Read:  Acne: వేసవికాలంలో మొటిమల సమస్యను దూరం చేసుకోండిలా..