Herbal Tea Benefits : ఆరోగ్య పరిరక్షణలో సహజ మార్గాలను అన్వేషించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా హెర్బల్ టీల వినియోగం గణనీయంగా పెరిగింది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెర్బల్ టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు చెబుతుంటారు. వీటిలో కమోమిల్ టీ (Chamomile Tea) ప్రాధాన్యత గలదిగా గుర్తించబడుతోంది. కమోమిల్ అనే మొక్క పూల నుండి తయారయ్యే ఈ టీని మార్కెట్లో పొడి రూపంలో పొందవచ్చు. ఇవి గడ్డి చామంతి పువ్వులను పోలి కనిపిస్తాయి. అయితే, వీటిలో దాగి ఉన్న ఔషధ గుణాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
Read Also: Prajwal Revanna : తక్కువ శిక్ష వేయండి.. కోర్టులో కన్నీరుమున్నీరైన ప్రజ్వల్ రేవణ్ణ
ఈ టీని రాత్రిపూట, భోజనం అనంతరం తాగటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కమోమిల్ టీలో ఉండే ఎపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గించి మనస్సును రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యంగా వస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది సహాయకారిగా మారుతుంది. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో ఒత్తిడితో కొట్టుమిట్టాడే వారు ఈ టీని రోజు తాగడం వల్ల మంచిది. ఇది నాడీ మండలంపై ప్రభావం చూపించే సెడేటివ్ లక్షణాలు కలిగి ఉండటంతో మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. ఇక, జీర్ణ సంబంధ సమస్యల పరంగా చూస్తే… కమోమిల్ టీ యాంటీ స్పాస్మోడిక్, కార్మినేటివ్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది జీర్ణాశయ కండరాలను ప్రశాంతపరచి, గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా తినిన తర్వాత ఈ టీ సేవిస్తే బరువుగా ఉండే అనుభూతిని తగ్గిస్తుంది.
కడుపు నొప్పి, వికారం, వాంతుల వంటి సమస్యలపైనా ఈ టీ ప్రభావం చూపుతుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీరంలోకి చేరే సూక్ష్మజీవులపై ప్రతిఘటన చూపిస్తాయి. దాంతోపాటు శరీరాన్ని రోగనిరోధకంగా మార్చడంలో సహాయపడతాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఫ్లూ వంటి శీతకాల వ్యాధులకూ ఇది ఉపశమనం ఇస్తుంది. శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తూ, జ్వరం వంటి ఇన్‌ఫెక్షన్లనూ త్వరగా తగ్గించడంలో సహకరిస్తుంది. ఇక డయాబెటిస్ బాధితులకు ఇది ఒక ఆశాజ్యోతి. అధ్యయనాల ప్రకారం, కమోమిల్ టీ బ్లడ్ షుగర్ స్థాయులను తగ్గించడంలో సహకరిస్తుంది. ఇది క్లోమగ్రంథి కణాల్లో వాపును అడ్డుకోవడంతో పాటు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల ప్రీ-డయాబెటిస్ లేదా డయాబెటిస్ ఉన్నవారికి దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది. మొత్తం మీద, కమోమిల్ టీ ఒక సాధారణమైనా అత్యంత ప్రభావవంతమైన ఆరోగ్య పానీయం. ఇది మన శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే అమూల్యమైన సహజ ఔషధం అని చెప్పొచ్చు. రోజూ ఒక కప్పు కమోమిల్ టీ తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.