Heart Attack : కరోనా వ్యాక్సిన్ తో.. గుండెపోటు ముప్పు ఉందా ? తాజా అధ్యయనం ఏం చెబుతోంది?

తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో.. కోవిడ్ వ్యాక్సిన్లకు - గుండెపోటు మరణాలు పెరుగుదలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 06:46 PM IST

కరోనా వైరస్(Corona) వచ్చాక.. దానిని అరికట్టేందుకు వివిధ కంపెనీలు వ్యాక్సిన్లు(Vaccines) తయారు చేశాయి. భారత ప్రభుత్వం రెండు డోసుల వ్యాక్సిన్ ను ఉచితంగా అందించింది. కోవిడ్ వ్యాక్సిన్ల తర్వాత.. గుండెపోటు మరణాలు పెరిగాయని, కరోనా బారిన పడినవారికి గుండెపోటు ముప్పు అధికంగా ఉంటుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ కారణంగానే గుండెపోటు(Heart Attack) వస్తుందన్న అనుమానాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం పలు కేంద్రాల్లో పరిశోధనలు చేపట్టింది. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో.. కోవిడ్ వ్యాక్సిన్లకు – గుండెపోటు మరణాలు పెరుగుదలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది.

భారత్ లో ప్రజలకు వేసిన కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని ఈ అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక PLOS వన్ జర్నల్ లో ప్రచురితమైంది. “దేశంలో వచ్చిన వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని మా అధ్యయనంలో స్పష్టమైంది. గుండెపోటులకు, వ్యాక్సిన్ కు సంబంధం లేదు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది.” అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించన పంత్ ఆస్పత్రికి చెందిన మోహిత్ గుప్తా వెల్లడించారు. ఆగస్టు 2021-2022 మధ్యకాలంలో ఢిల్లీ జీబీ పంత్ ఆసుపత్రిలో చేరిన 1578 మంది పేషంట్లలో 1086 మంది వ్యాక్సిన్ తీసుకున్నవారు ఉండగా.. 492 మంది వ్యాక్సిన్ తీసుకోని వారున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 2 డోసులు వేయించుకున్నవారు 96 శాతం ఉండగా.. 4 శాతం మాత్రం ఒక డోసు తీసుకున్నవారు ఉన్నారు.

ఆసుపత్రిలో చేరిన ఏఎంఐ (అక్యూట్ మయోకార్డియర్ ఇన్ ఫార్ క్షన్) బాధితుల్లో వయోభారం, షుగర్, ధూమపానం కారణాలవల్లే గుండెపోటు ముప్పు ఎక్కువగా కనిపించిందన్నారు. ఈ అధ్యయనం ఒక కేంద్రంలో మాత్రమే జరిగిందని, దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

 

Also Read : New Oxygen : కొత్త రకం ఆక్సీజన్.. అందులో ఏమున్నాయ్ తెలుసా ?