Heart Health: మీ గుండె ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు పాటించండి..!
Maheswara Rao Nadella
Heart Health
మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన, సున్నితమైన భాగాల్లో గుండె (Heart) ఒకటి. గుండెను జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనం జీవించగలం. దానికి ఏ చిన్న సమస్య వచ్చినా.. ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కొందరు చిన్నవయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు రావడానికి.. విపరీతమైన ఒత్తిడి, స్మోకింగ్, మధ్యపానం ప్రధాన కారణాలు. కలుషిత గాలి, ఆహారపు అలవాట్లు కూడా గుండె (Heart) సమస్యలకు కారణాలు అని నిపుణులు అంటున్నారు. గుండె బలహీనంగా ఉంటే.. మీరు కరోనరీ ఆర్టరీ డిసీజ్, అరిథ్మియా, గుండె కండరాల సమస్యలు, గుండె కవాట సమస్యలు వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గుండె వీక్‌గా ఉంటే.. ఛాతీ నొప్పి, ఛాతీ బిగుతుగా ఉండటం, శ్వాస ఆడకపోవడం, మెడ-దవడ నొప్పి, చేతు, కాళ్లలో తిమ్మిరి, అసాధారణ హృదయ స్పందన వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండటానికి.. దాన్ని దృఢంగా తయారు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయమం, ధ్యానం లాంటివి చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
నడవండి:
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించన పరిశోధన ప్రకారం రోజూ తగినంత నడిస్తే.. గుండె సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. మెడికల్ న్యూస్ టుడే ప్రకారం, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 6000 అడుగులు నడవాలి. ఆరు వేలు/ అంతకంటే ఎక్కువ అడుగులు నడవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.
విటమిన్ కె తీసుకోండి:
గుండెజబ్బు ముప్పు తగ్గడానికి, రక్తప్రసరణ మెరుగుపడడానికి విటమిన్ కె సహాయపడుతుంది. రక్తనాళాల్లో కాల్షియం పోగుపడటాన్నీ తగ్గిస్తుంది. వీటిని రక్తనాళాల నుంచి తిరిగి ఎముకలు, దంతాల్లోకి చేర్చటానికీ ఉపయోగపడుతుంది. సార్‌డైన్ వంటి చేపల్లో, ఆకుకూరలు, క్యాబేజీ, పచ్చిబఠాణీ వంటి ఆహార పదార్థాల్లో విటమిన్ కె మెండుగా ఉంటుంది. మనకు రోజుకు 120 మైక్రోగ్రామలు విటమిన్ కె అవసరం.
ఫైబర్ తీసుకోండి:
నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఫైబర్ హైబీపీని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది. రోజుకు ఐదు నుంచి 10 గ్రాములు ఫైబర్ మీ రక్తంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. బీన్స్, అవకాడోలు, బెర్రీలు, నట్స్, ఓట్స్, బార్లీ, ఆపిల్, క్యారెట్, అవిసె గింజలు, జామకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, కోడిగుడ్డు, వాల్‌నట్స్, బ్రొకోలి, కొత్తిమీర, అవిసె గింజలు, ఆలీవ్ ఆయిల్, అవకాడో,చియా గింజలు,పిస్తా,చేపల్లో టూనా చేపలు,సాల్మన్ చేపలు, మెర్రింగ్, వంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని మనం ప్రతీరోజు తినాలి.
వ్యాయమం చేయండి:
రోజూ వ్యాయామం చేయడం.. ఎక్కువగా శారీరక శ్రమ ఉండే పనులు చేసేవారిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు గుండె వేగాన్ని పెంచే వ్యాయామాలు 10 నిమిషాలు చేసినా.. మంచిదని నిపుణులు అంటున్నారు. ఉన్నచోటే ఎగరటం, గుంజీలు తీసినట్టు పిరుదులను మోకాళ్ల ఎత్తు వరకు వచ్చేలా నడుమును కిందికి తేవటం, కాళ్లు లేపటం, చేతులు తిప్పటం వంటివి చేయండి
ప్రాణాయామం, ధ్యానం:
ఒత్తిడి తగ్గడానికి దోహదం చేసే ప్రాణాయామం, ధ్యానం వంటి వాటితో గుండెజబ్బు ముప్పు 48% వరకు తగ్గుతున్నట్టు అధ్యయనాలు స్పష్టంచేశాయి. రోజూ కొంతసేపు ప్రశాంతమైన వాతావరణంలో వీటిని సాధన చేస్తే గుండె ఆరోగ్యానికి మంచిది.