Site icon HashtagU Telugu

HMPV Virus In India : భారత్‌లో తొలి HMPV కేసు నమోదు

HMPV

HMPV

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాన్యు మోవైరస్ (HMPV) ఇప్పుడు భారతదేశానికి కూడా చేరినట్లు సమాచారం. బెంగళూరు(Bengaluru)లో ఓ ఎనిమిది నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. చిన్నారిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు దీని వెనుక ఉన్న కారణాలను విశ్లేషించేందుకు టెస్టులు నిర్వహించారు. టెస్టుల్లో ఈ చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది.

HMPV గురించి భారతీయ వైద్యనిపుణులు సీరియస్‌గా పరిశోధనలు ప్రారంభించారు. ఈ వైరస్ శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతుందని, ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈ వైరస్ సోకితే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, కొన్నిసార్లు పరిస్థితి తీవ్రమవడం వల్ల ఆస్పత్రిపాలవాల్సి వస్తుంది.

KTR : ఫార్ములా ఈ కేసు.. నేడు ఏసీబీ ఎదుట హాజరుకానున్న కేటీఆర్

ఈ కేసు నేపథ్యంపై కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) స్పందించింది. HMPV కేసు తమకు తెలిసినప్పటికీ, అధికారికంగా నిర్ధారణ కోసం మరింత ల్యాబ్ టెస్టులు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. చిన్నారిలో కనిపించిన లక్షణాలు, ఆస్పత్రి చేసిన టెస్టుల ఫలితాల ఆధారంగా మరింత సమాచారాన్ని సేకరించే ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం వివరించింది. HMPV వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగించడమే కాకుండా, దీని నివారణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. శుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య పద్ధతులు పాటించడం ద్వారా ఈ వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న చిన్నారులను వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.

ప్రస్తుతం ఈ కేసు వల్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు, వైద్య సంస్థలు కలిసికట్టుగా పని చేసి వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. HMPV పై అవగాహన పెంచడం, వ్యాధి నివారణ మార్గాలను ప్రజలకు చేరవేయడం కీలకం. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్నందున, భారతదేశంలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.

HMPV లక్షణాలు :

HMPV ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది శీతాకాలం, వసంతకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ జలుబు లాంటి లక్షణాలనుండి తీవ్రమైన న్యుమోనియా వరకు ఈ వైరస్ ప్రభావం చూపుతుంది. దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు తీవ్రస్థాయికి చేరుకుంటే ఆసుపత్రిలో చికిత్స అవసరం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

ఈ వైరస్ ఎక్కువగా శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడగడం, శరీర సంబంధాలు తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. HMPV కి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రస్తుతానికి సరైన చికిత్స లభ్యం కాని పరిస్థితి.