మనం ఆరోగ్యంగా జీవించాలంటే శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో ప్రొటీన్ కూడా ఒకటి. మన శరీరంలో ప్రొటీన్ అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో కండ పెరుగుదలకు, కణాల నిర్మాణానికి, పాడైన కణాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో ప్రొటీన్ ఎంతో అవసరమవుతుంది. అలాగే జుట్టు ఎదుగుదలకు, ఎముకలు, గోర్లు, చర్మం ఆరోగ్యంగా ఉండటంలోనూ, అవయవాల పరిపూర్ణ ఆరోగ్యానికి కూడా ప్రొటీన్ అవసరం చాలానే ఉంటుంది. అందుకే రోజూ తినే ఆహారంలో 15 నుంచి 33 శాతం ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి. కానీ.. నేటి జీవనశైలిలో శరీరానికి తగిన పోషకాలు అందే ఆహారం చాలా తక్కువ తింటున్నాం. అందుకే తరచూ అనారోగ్యానికి గురవుతుంటాం. శరీరానికి కావలసినంత ప్రొటీన్ అందాలంటే.. ప్రతిరోజూ కొన్నిరకాల పండ్లను తప్పకుండా తింటుండాలి.
ప్రొటీన్ అనగానే చాలామందికి గుర్తొచ్చేవి నాన్ వెజ్ రకాలే. చికెన్, గుడ్లు తింటే ప్రొటీన్ బాగా సరిపోతుందనుకుంటే పొరపాటే. వాటికన్నా తక్కువ ధరకే లభించే పండ్లలోనూ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఆ లిస్టులో జామపండ్లు మొదటి స్థానంలో ఉన్నాయి. అతితక్కువ ధరకే లభించే ఒక కప్పు జామపండు ముక్కలలో 4.2 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. జామపండు తర్వాత.. పనసపండు తొనల్లోనూ ప్రొటీన్ లభిస్తుంది. ఒకకప్పు పనస తొనలలో అనేక రకాల పోషకాలతో పాటు 2.8 గ్రాముల ప్రొటీన్ కూడా ఉంటుంది. పనసపండ్లు లభించే సీజన్ లో వీటిని తినడం అస్సలు మిస్ కావొద్దు.
అతితక్కువ ధరకే లభించే పండ్లలో అరటిపండ్లు కూడా ఒకటి. ఒక అరటిపండులో 1.3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. రుచికి తియ్యగా, వగరుగా ఉండే అరటిపండ్లను రోజూ ఒకటి తింటే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఆప్రికాట్ లలో కూడా ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఒక ఆప్రికాట్ లో 2.3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. గ్రేప్ ఫ్రూట్ లోనూ ప్రొటీన్ కావలసినంత దొరుకుతుంది. ఇది చూడటానికి నారింజపండులా ఉంటుంది కానీ.. నారింజ కాదు. ఒక గ్రేప్ ఫ్రూట్ లో 1.6 గ్రాముల ప్రొటీన్ తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. గుడ్లు, మాంసం ఇష్టపడని వారు, ఇష్టపడే వారు కూడా ఈ పండ్లను తింటే.. ప్రొటీన్ లోపం తగ్గి.. ఆరోగ్యంగా కూడా ఉంటారు.
Also Read : Sugar Affect: మీరు స్వీట్లు ఎక్కువ తింటున్నారా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి..!