Hair Loss: జుట్టు రాలడం అనేది నేడు పెద్ద సంఖ్యలో ప్రజలను వేధిస్తున్న సమస్య. చాలా మంది పురుషులు దీనిని వయసు పెరగడం వల్ల వచ్చే సాధారణ మార్పుగా భావించి వదిలేస్తుంటారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త సమాచారం ప్రకారం.. ఒక సాధారణ జీవనశైలి అలవాటు జుట్టు రాలడాన్ని వేగవంతం చేయడమే కాకుండా, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి కూడా కారణమవుతోంది. ధూమపానం కేవలం ఊపిరితిత్తులు, గుండెకు మాత్రమే కాకుండా జుట్టు కుదుళ్లకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధూమపానం వల్ల జుట్టుకు ఎలా నష్టం జరుగుతుంది?
పొగాకు తాగడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. తద్వారా జుట్టు రాలే ప్రమాదం పెరుగుతుంది. Wiley పత్రికలో ప్రచురితమైన ఒక పరిశోధనలో.. 20 నుండి 35 ఏళ్ల లోపు పురుషులలో ధూమపానం చేసేవారికి, చేయనివారికి మధ్య ‘ఆండ్రోజెనెటిక్ అలోపేసియా’ (మెల్ పాటర్న్ బట్టతల) ఏ స్థాయిలో ఉందో పోల్చి చూశారు.
ఈ అధ్యయనంలో తేలిన ఆశ్చర్యకరమైన విషయాలు
500 మంది ధూమపానం చేసేవారిలో 425 మందికి ఏదో ఒక స్థాయిలో జుట్టు రాలే సమస్య ఉంది. అదే 500 మంది ధూమపానం చేయనివారిలో ఈ సంఖ్య కేవలం 200 మాత్రమే. హమిల్టన్-నార్వుడ్ స్కేల్ ప్రకారం గ్రేడ్ 3లో హెయిర్ లైన్ వెనక్కి వెళ్తుంది. గ్రేడ్ 4లో తల పైభాగంలో స్పష్టంగా బట్టతల కనిపిస్తుంది.
ఈ పరిశోధనలో ధూమపానం చేసేవారిలో 47 శాతం మంది గ్రేడ్ 3కి, 24 శాతం మంది గ్రేడ్ 4కి చేరుకున్నారని తేలింది. అదే ధూమపానం చేయనివారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఈ స్థాయిలకు చేరుకున్నారు. నికోటిన్, పొగాకులోని ఇతర రసాయనాలు జుట్టు రాలడాన్ని వేగవంతం చేస్తాయని పరిశోధకులు నమ్ముతున్నారు.
Also Read: సౌతాఫ్రికాతో మ్యాచ్.. బుమ్రా సరికొత్త రికార్డు!
ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం
ధూమపానం వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ (Oxidative Stress) పెరుగుతుంది. అంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ పరిమాణం ఎక్కువ అవుతుంది. ఈ హానికరమైన కణాలు శరీర కణాలలోని డీఎన్ఏ (DNA)ను దెబ్బతీస్తాయి. పొగాకు పొగతో పాటు కాలుష్యం, ఎండ కూడా ఇదే విధమైన ప్రభావాన్ని చూపుతాయి. జుట్టు కుదుళ్లలోని కణాలు దెబ్బతింటే జుట్టు పెరుగుదల ఆగిపోతుంది.
దీనితో పాటు సిగరెట్ తాగడం వల్ల రక్త ప్రసరణ బలహీనపడుతుంది. రక్త నాళాలలో అడ్డంకులు ఏర్పడటం వల్ల ఆక్సిజన్, పోషకాలు స్కాల్ప్ (తల చర్మం)కు సరైన పరిమాణంలో అందవు. దీనివల్ల జుట్టు బలహీనపడి రాలిపోతుంది. అంతేకాకుండా ధూమపానం వల్ల శరీరంలో వాపును కలిగించే ప్రోటీన్లు ఉత్తేజితమవుతాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇవన్నీ కలిసి జుట్టు పల్చబడటానికి, బట్టతల రావడానికి కారణమవుతాయి.
