Cough Relief: ఆయుర్వేదంలో వంటగదిలోని మసాలా దినుసులను ఆరోగ్యానికి సంజీవనిలా భావిస్తారు. ముఖ్యంగా తేనెలో మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, గొంతు గరగర వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో చలి గాలుల వల్ల వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు మందుల షాపుల చుట్టూ తిరగకుండా మన వంటగదిలోనే ఉండే నల్ల మిరియాలు, తేనెతో అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. కేవలం రుచి కోసమే కాకుండా ఔషధ గుణాల గనిగా పిలిచే నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
శతాబ్దాల కాలంగా జలుబు, దగ్గు వంటి సమస్యలకు తేనెలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఈ మిశ్రమం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి ఎంపికగా మారుతుంది.
Also Read: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్‌డేట్స్ ఇవే!
జీర్ణక్రియకు మెరుగు
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తేనె- మిరియాల కలయిక శరీర మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరంలోని అనవసరపు కొవ్వు కరుగుతుంది. అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎలా తీసుకోవాలి?
ఈ ఔషధాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక గిన్నెలో ఒక చెంచా తేనె తీసుకోవాలి. అందులో పావు చెంచా కంటే తక్కువగా (చిటికెడు) నల్ల మిరియాల పొడిని కలపాలి. రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. ఈ మిశ్రమాన్ని తిన్న తర్వాత వెంటనే నీరు తాగకూడదు. అప్పుడే అది గొంతుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.
