Exercise: వ్యాయామంఉదయం కంటే సాయంత్రం ఉత్తమం!

మధుమేహం ఒక తీవ్రమైన లైఫ్ స్టైల్ డిసీజ్. జాగ్రత్త వహించకపోతే ఇది ఒక్కోసారి జీవితాన్ని తల్లక్రిందులు చేసేస్తుంది.

  • Written By:
  • Publish Date - November 17, 2022 / 10:00 PM IST

మధుమేహం ఒక తీవ్రమైన లైఫ్ స్టైల్ డిసీజ్. జాగ్రత్త వహించకపోతే ఇది ఒక్కోసారి జీవితాన్ని తల్లక్రిందులు చేసేస్తుంది. డయాబెటిస్‌లో టైప్ 1, టైప్ 2 అని రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండూ రక్తంలో చక్కెర, గ్లూకోజ్ అధిక స్థాయి కారణంగా ఏర్పడతాయి.మంచి సమతుల్య ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు మధుమేహ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అయితే, మీరు వ్యాయామం చేసే సమయాన్ని బట్టి మీరు పొందే ప్రయోజనాలలో భారీ వ్యత్యాసం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం చేసే వ్యాయామం కంటే సాయంత్రం వ్యాయామం చేసే వారికి మధుమేహం వచ్చే అవకాశం తక్కువని కొత్త అధ్యయనం చెబుతోంది.

నెదర్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధన

రోజు సాయంత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ అద్భుతంగా నియంత్రణలో ఉంటుందని నెదర్లాండ్ శాస్త్రవేత్తల అంటున్నారు. నెదర్లాండ్ శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనలో భాగంగా 775 మంది డచ్ స్త్రీ, పురుషులపై వ్యాయామం ప్రభావం ఏ విధంగా ఉందో అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో తేల్చిన అంశాలను డయాబెటోలాగియా జర్నల్‌లో ప్రచురించారు. 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వారి వ్యాయామ సమయాల ఆధారంగా వారిని మూడు గ్రూపులుగా విభజించారు. ఉదయం (6-12 గంటల మధ్య), మధ్యాహ్నం (12-6 గంటల వరకు), సాయంత్రం (6 నుండి అర్ధరాత్రి వరకు) వ్యాయామం చేసేవారిని మూడు గ్రూపులుగా గుర్తించారు. వారి చేత వివిధ పద్దతుల్లో వ్యాయామం చేయిస్తూ వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నమోదు చేసి విశ్లేషించారు.

పరిశోధన ఫలితాలు

శరీరంలోని కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్‌కు సరిగ్గా స్పందించకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది టైప్ 2 మధుమేహం లక్షణం. గర్భస్త మధుమేహం కొన్ని సందర్భాలలో ప్రీడయాబెటిస్‌కు దారి తీస్తుంది. ఉదయం కంటే మధ్యాహ్నం, సాయంత్రం వ్యాయామం చేసిన రెండు గ్రూపుల సభ్యులకు ఇన్సులిన్ నిరోధకత తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు. ఇన్సులిన్ నిరోధకత తగ్గటం అంటే శరీరంలోని కణాలు ప్యాక్రియాస్ గ్రంధి ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ కు బాగా స్పందిస్తున్నాయని అర్ధం. మధ్యాహ్నం వ్యాయామం చేసిన గ్రూపుకు 18 శాతం, సాయంత్రం చేసిన గ్రూపుకు 25 శాతం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది. పగటిపూటతో పోలిస్తే మధ్యాహ్నం, సాయంత్రం శక్తివంతమైన వ్యాయామం చేయడంతో ఇన్సులిన్ నిరోధకత 25 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు.