Aloe Vera Peel: ముఖంపై పేరుకుపోయిన ధూళి, మట్టి, మురికిని తొలగించడానికి ప్రతిరోజూ చర్మాన్ని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. దీని కోసం చాలామంది రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి ముఖాన్ని శుభ్రం చేసినప్పటికీ కొంతకాలం తర్వాత చర్మం సాగిపోవడం, పొడిబారడం, డ్రైనెస్ వంటి సమస్యలకు దారితీస్తాయి. అటువంటి పరిస్థితిలో చర్మ ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయకుండా సహజసిద్ధమైన మెరుపును అందించే ప్రకృతి సిద్ధమైన వస్తువులను వాడటం ఉత్తమం.
అందుకోసం మీరు కలబంద తొక్కలను ఉపయోగించవచ్చు. సాధారణంగా మనం లోపల ఉండే జెల్‌ను వాడి తొక్కలను పారేస్తుంటాం. కానీ ఆ తొక్కలతో ముఖాన్ని ఎలా మెరిపించుకోవచ్చో తెలుసుకుందాం.
Also Read: స్మృతి- పలాష్ పెళ్లి ఆగిపోవడానికి కారణమిదే?!
కలబంద తొక్కలను ఉపయోగించే విధానాలు
ఫేస్ ప్యాక్‌గా: కలబంద తొక్కలతో మీరు అద్భుతమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం తొక్కలను మిక్సీ గ్రైండర్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొంచెం గులాబీ నీరు (Rose Water) కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే చర్మం తాజాగా మారుతుంది.
నేచురల్ స్క్రబ్‌గా: చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడానికి ఇది సహజమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. కలబంద తొక్కలను చిన్న ముక్కలుగా కోసి, వాటితో ముఖంపై మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది. కావాలనుకుంటే ఇందులో కొంచెం ముల్తానీ మట్టిని కలిపి కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను (Dark Circles) తగ్గించుకోవడానికి కూడా వాడవచ్చు.
నేరుగా శుభ్రం చేసుకోవడానికి: ఎటువంటి హడావిడి లేకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలంటే.. కలబంద తొక్కను తీసుకుని లోపలి వైపు నుండి ముఖంపై రుద్దాలి. 5 నిమిషాల తర్వాత వేడి నీటితో ముఖం కడుక్కోవాలి. దీనివల్ల ముఖంలోని మురికి తక్షణమే తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు కూడా తగ్గుతాయి.
స్కిన్ టోనర్‌గా: కలబంద తొక్కలతో మంచి టోనర్‌ను కూడా తయారు చేయవచ్చు. తొక్కల నుండి రసాన్ని తీసి ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. దీనిని ప్రతిరోజూ ముఖంపై స్ప్రే చేసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉండటమే కాకుండా, చర్మ రంధ్రాలు బిగుతుగా మారుతాయి.
