Site icon HashtagU Telugu

Fact Check : ‘‘30 కోట్లిచ్చి టికెట్ తెచ్చుకున్నా’’.. ఇవి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి వ్యాఖ్యలేనా ?

Fact Check Mlc Ticket Bjp Mlc Anji Reddy Newsmeter Shakti Collective

Fact Checked By Newsmeter

ప్రచారం : ‘‘ఎన్నికల ప్రచారంలో నాకు పార్టీ కార్యకర్తలు సహకరించాలి.  నేను రూ.30 కోట్లు ఇచ్చి సీటు కొన్నా’’ అని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్న న్యూస్ క్లిప్‌ వైరల్ అవుతోంది.

వాస్తవం : వైరల్ న్యూస్ క్లిప్‌లో ఉన్న అంశాలు తప్పు. అసలు ఆ పేరుతో న్యూస్ సంస్థ ఉనికిలో లేనే లేదు.

Also Read :BJP New President: మార్చి 30 కల్లా బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో వీరే..

కరీంనగర్ -మెదక్ – నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  ఫిబ్రవరి 27న జరగనుంది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజి రెడ్డిని ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారంటూ ఓ న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ న్యూస్ క్లిప్‌లో “టికెట్ పుణ్యానికి ఇవ్వలేదు… 30 కోట్లిచ్చా…!” అనే టైటిల్ ఉంది. బీజేపీ కార్యకర్తలు తన తరఫున ప్రచారం చేయకపోయినా సరే, ఓటుకు రెండు వేలు పంచైనా గెలుస్తా అని అంజిరెడ్డి అన్నట్లుగా ఈ న్యూస్ క్లిప్‌లో రాశారు.

న్యూస్ క్లిప్‌లో ఇంకా ఏముందంటే.. ‘‘ఎవరెవరు ప్రచారం చేయడం లేదో లిస్టు రాసుకుంటున్న.. పోలింగ్ అయ్యాక ఒక్కొక్కడి తోలు తీస్తా. కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్‌లకు రూ.30 కోట్లు సింగిల్ పేమెంట్ చేసి టికెట్ తెచ్చుకున్నాను – బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాస్ వార్నింగ్” అని  అందులో ప్రస్తావించారు.

న్యూస్ క్లిప్‌పై ‘తెలంగాణ న్యూస్ టుడే’(Fact Check)  లోగోతో పాటు లింక్ ఉన్నాయి.

వార్త క్లిప్పింగ్‌ను ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశారు. “ఇంత డైరెక్టుగా, పబ్లిక్ గా చెబుతున్నాడు. అయినా కూడా ఎక్కడా స్పందించని ED, IT, CBI, EC వ్యవస్థలు. అసలు భారత దేశంలో రాజ్యాంగం ఉందా.. ఉంటే అమలువుతోందా’’ అనే క్యాప్షన్‌తో ఎఫ్‌బీలో షేర్ చేశారు. (ఆర్కైవ్)

ఇవే క్లెయిమ్స్‌తో ఉన్న పోస్టును ఇక్కడ చూడొచ్చు.(ఆర్కైవ్)

Also Read :Katrina Kaif : మహాకుంభ మేళాలో కత్రినా కైఫ్.. స్వామీజీల నుంచి ఆశీస్సులు

వాస్తవ తనిఖీలో ఏం తేలింది ?

ఆ న్యూస్ క్లిప్‌ ద్వారా జరిగిన ప్రచారం తప్పు అని ‘న్యూస్‌మీటర్’ గుర్తించింది. అసలు ఆ పేరుతో వార్తా సంస్థ ఏదీ ఉనికిలో లేదు.

బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ టికెట్ కొనుక్కున్నట్టు చూపిస్తున్న వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులేవీ మాకు దొరకలేదు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన వార్నింగ్ ఇచ్చారని చూపిస్తున్న విశ్వసనీయ సమాచారమేదీ దొరకలేదు.

వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌పై అంజిరెడ్డి స్పందిస్తూ… తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు.

‘‘కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంలో భాగమే ఈ ఫేక్ న్యూస్ క్లిప్’’ అని అంజిరెడ్డి తెలిపారు. “చేసిన సేవ, నమ్మిన సిద్ధాంతమే బలంగా నేను బరిలోకి దిగినోడిని… నన్ను న్యాయంగా ఎదుర్కోలేక ఫేక్ న్యూస్‌తో  కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు” అని పోస్టులో ఆయన పేర్కొన్నారు.

ఈ అంశంపై అంజిరెడ్డి బృందంతో న్యూస్‌మీటర్ మాట్లాడింది. వారు వైరల్ అవుతున్న క్లెయిమ్స్‌ను తోసిపుచ్చారు. న్యూస్ క్లిప్పింగ్‌లో ఉపయోగించిన చిత్రం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ సమావేశంలో తీసినదని తెలిపారు.

ఈ ఫోటోను అంజిరెడ్డి ఫేస్‌బుక్‌లో 2025 ఫిబ్రవరి 20న అప్‌లోడ్ చేశారు. ‘‘ఇవాళ కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జరిగిన గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చార‌ సమావేశంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ @mpbbpatil గారు, కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ నీలం చిన్న రాజులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు’’ ” అని దానికి  క్యాప్షన్‌ పెట్టారు.

ఈ వార్తా సంస్థ గురించి గతంలో కూడా న్యూస్‌మీటర్ కథనం రాసింది. తెలంగాణ న్యూస్ టుడే అనే సంస్థ  అసలు ఉనికిలోనే లేదు. వైరల్ అయిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఫేక్.

న్యూస్ క్లిప్పింగ్ బ్యానర్‌పై ఉన్న యూఆర్ఎల్ లింక్ కూడా మనుగడలో లేదు. దీని కోసం మేం గూగుల్, బింగ్‌‌లలో వివిధ కీవర్డ్‌లతో సెర్చ్ చేశాం. తెలంగాణ న్యూస్ టుడే డైలీ ఈ-పేపర్ లేదా దాని వెబ్‌సైట్ ఎక్కడా మాకు దొరకలేదు.

Whois ఉపయోగించి telangananewstodaydaily డొమైన్ ఇంకా నమోదు కాలేదని గుర్తించాం. భారతదేశ వార్తాపత్రికల రిజిస్ట్రార్ కార్యాలయ వెబ్‌సైట్‌లో ‘తెలంగాణ న్యూస్ టుడే’, ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే పేర్లతో రిజిస్టర్ అయిన వార్తాసంస్థల కోసం శోధించాం. ఈ శీర్షికలతో ఏ వార్త సంస్థ కూడా నమోదు కాలేదని మేం గుర్తించాం.

తెలంగాణ న్యూస్ టుడే డైలీ సంస్థ పేరుతో వైరల్ అయిన న్యూస్ క్లిప్‌లు ఫేక్. అవన్నీ కట్టుకథలే.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా న్యూస్ మీటర్ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)