Yama Dwitiya 2024 : రేపు (నవంబరు 3న) మనం ‘యమ ద్వితీయ’ను జరుపుకోబోతున్నాం. పవిత్రమైన కార్తీక మాసపు శుక్ల పక్షంలో వచ్చే విదియ తిథిని యమ ద్వితీయ అని పిలుస్తారు. ఈ రోజున భగినీ హస్త భోజనంతో పాటు అక్షయ లక్ష్మీ కుబేర పూజ నిర్వహించాలని పెద్దలు చెబుతున్నారు. ‘యమ ద్వితీయ’ రోజు ఇంకా ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :US Donation Race : ఎన్నికల విరాళాల రేసులో కమల టాప్.. డొనేషన్ల సేకరణకు రూల్స్ ఇవీ
‘భగినీ హస్త భోజనం’
‘యమ ద్వితీయ’ రోజు ‘భగినీ హస్త భోజనం’ చేయాలి. భగినీ అంటే సోదరి. సోదరులు తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లాలి. తన ఇంటికి వచ్చిన సోదరుల నుదుటన సోదరి తిలకం దిద్దాలి. అనంతరం సోదరి స్వహస్తాలతో సోదరులకు భోజనం వడ్డించాలి. భోజనం చేసిన అనంతరం సోదరులు ఆమెకు చీర, సారె పెట్టాలి.
యముడు చెప్పిన సీక్రెట్..
మార్కండేయుడు అల్పాయుష్కుడు. దీంతో ఆయన ప్రాణాలను తీసుకెళ్లేందుకు యమధర్మరాజు వస్తాడు. మార్కండే యుడిపైకి యమపాశాన్ని యముడు విసురుతాడు. దాన్ని తప్పించుకునేందుకు శివలింగాన్ని మార్కండేయుడు(Yama Dwitiya 2024) కౌగిలించుకుంటాడు. దీంతో యమపాశం వెళ్లి శివలింగాన్ని తాకుతుంది. దీంతో శివుడికి కోపం వస్తుంది. వెంటనే యమధర్మరాజుపైకి తన త్రిశూలాన్ని విసురుతాడు. దీంతో యముడు భయపడి పారిపోయి తన చెల్లెలు యమున ఇంట్లో తలదాచుకుంటాడు. యమున తన సోదరుడు యముడికి సకల మర్యాదలు చేసింది. యముడు భోజనం చేస్తుండగా శివుడి త్రిశూలం అక్కడికి చేరుకుంటుంది. భోజనం చేసేవారిని సంహరించరాదని శివుడి ఆజ్ఞ మేరకు త్రిశూలం వెనక్కి వెళ్లిపోతుంది. దీంతో కార్తీక శుక్ల విదియ రోజు సోదరి ఇంటికి వెళ్లి, ఆమె చేతి వంట తినే సోదరుడి గృహంలో అపమృత్యు దోషాలు ఉండవని స్వయంగా యముడు చెబుతాడు. అందుకే యమ ద్వితీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.