Vaikuntha Ekadashi : 2023లో వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది?

2023 లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadashi) జనవరి 2 సోమవారం వచ్చింది.

2023 లో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) లేదా ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadashi) జనవరి 2 సోమవారం వచ్చింది. ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.. దీని వెనకున్న పరమార్థం ఏంటంటే..

మనుషులకు ఏడాది సమయం దేవతలకు ఒక్కరోజుతో సమానం. అందుకే.. మన ఆరు నెలలు దేవతలకు పగలు, మరో ఆరు నెలలు రాత్రి. దీని ప్రకారం దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి.. ఉత్తరాయణం అంతా పగలుగా చెబుతారు పండితులు. దీని ప్రకారం వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమీపానికి వచ్చారని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చారన్నమాట. శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు. స్వర్గ ద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.. ఈ ద్వారం గుండా లోపలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.

”వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి  ఉత్తర ద్వార దర్శనాత్ ”

అంటే, ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర  ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. ఏడాదిలో ఉండే 12 నెలల్లో 11 వది పుష్యమాసం . ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు.

ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి?

ముక్కోటి  ఏకాదశి రోజున ఎక్కువ  మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు.  శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయని చెబుతారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.  రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని.. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం.

ఉపవాసం ఎందుకు ఉండాలి?

వైకుంఠ ఏకాదశి రోజు రాక్షసుడు ”ముర” బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తిన కూడదని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని చెబుతోంది విష్ణుపురాణం. ”ముర” అనే రాక్షస గుణాన్ని ఉపవాసం, జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం తెరుచుకుంటుందని చెబుతారు.  వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని మాత్రమే కాదు.. ఈ రోజు మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే వైకుంఠ ఏకాదశి అంత ప్రత్యేకం. 2023లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి జనవరి 2 సోమవారం వచ్చింది.

జనవరి 4 నుండి జనవరి 11, 2023 వరకు తిరుమల వసతి కోటా బుకింగ్ కోసం 28.12.2022 తేదీన ఉదయం 09:00 గంటలకి అందుబాటులో ఉంటుంది.

గమనిక: వైకుంఠ ఏకాదశి దృష్ట్యా 2023 జనవరి 1, 2 మరియు 3 తేదీల్లో ఆన్లైన్ వసతి కోటా అందుబాటులో ఉండదు.

Also Read:  Tirumala TTD : తిరుమలలో టీటీడీ అధికారుల పై శ్రీవారి భక్తుల ఆగ్రహం