Atla Tadde 2023 : ‘అట్ల తద్ది’.. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున జరుపుకుంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ అట్ల తద్ది చేసుకుంటారు. భర్తల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం మహిళలు ఈరోజున వ్రతం ఆచరిస్తారు. అట్ల తద్దికి ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అనే పేర్లు కూడా ఉన్నాయి. దీన్ని ఉత్తర భారతదేశంలో ‘కర్వా చౌత్’ అని పిలుస్తారు. ఏటా ఆశ్వయుజ బహుళ తదియ రోజు ఈ పూజ చేస్తారు. ఇవాళే (అక్టోబరు 31) అట్ల తదియ వేడుక.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు ఏమేం చేస్తారు ?
ఈ రోజు ఉదయాన్నే ఆడపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు పెట్టుకుంటారు. ఆడపిల్లలందరూ చల్లని నీడనిచ్చే చెట్ల కింద చేరతారు. అక్కడ ఊయల కట్టి అందులో ఆనందంగా ఊగుతారు. ‘‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్ , ముద్ద పప్పోయ్ మూడట్లోయ్’’ అంటూ అంటూ పాటలు పాడుకుంటూ ఇరుగు పొరుగు వారికి వాయినాలు ఇస్తారు. పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిలు ఈరోజు తమకు కాబోయే భర్త మంచివాడుగా ఉండాలని కోరుకుంటూ వ్రతం పాటిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీ దేవికి, చంద్రుడికి పూజ చేసి 11 అట్లు చొప్పున నైవేద్యం పెట్టి…మరో పది అట్లు ముత్తైదువుకు వాయనంగా అందిస్తారు. 11 తాంబూలాలు వేసుకుంటారు. 11 ఉయ్యాలలు ఊగుతారు. 11 రకాల ఫలాలు(Atla Tadde 2023) తింటారు.
అంగారకుడు.. అట్లు..
అంగారకుడి(కుజుడు)కి అట్లు అంటే బాగా ఇష్టం. ఆయనకు నైవేద్యంగా అట్లు పెడితే కుజదోషం తొలగిపోయి సంసార సుఖంలో అడ్డంకులు ఉండవని నమ్ముతారు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లు వేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. ఈ అట్లను అమ్మవారికి నివేదించటంతో గ్రహాలు శాంతించి జీవితాన్ని సుఖవంతంగా మారుస్తాయని విశ్వసిస్తారు.
Also Read: Green Chilli Benefits: పచ్చి మిరపకాయలను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?
అట్లతద్ది.. పురాణ గాథ
పురాణాల ప్రకారం.. ఒక యువరాణి మంచి జీవిత భాగస్వామి కావాలనే కోరికతో అట్ల తద్ది ఉపవాసం చేయగా..ఆమె ఆకలి దప్పికలతో మూర్ఛపోయింది. యువరాణి అనారోగ్యంతో ఉండటంతో.. సోదరులు ఆమెకు మంచి వరుడిని కనుగొనలేకపోయారు. ఎట్టకేలకు ఓ వృద్ధుడితో పెళ్లి చేయాలని డిసైడ్ చేశారు. నిరుత్సాహానికి గురైన యువరాణి అడవికి పారిపోయి ఒక మర్రి చెట్టు కింద బాధపడుతూ కూర్చుంది. ఆమె ఆవేదనతో చలించిపోయిన పార్వతీ దేవి ప్రత్యక్షమై.. మళ్లీ అట్ల తద్ది వ్రతం పాటించాలని సూచించారు. తిరిగి రాజ భవనానికి వెళ్లి ఆ యువతి అట్లతద్ది వ్రతాన్ని చేసింది. ఆ తర్వాత ఆమె కలలు కన్న వ్యక్తితో వివాహం జరుగుతుంది.
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.