Pelli Muhurtham in 2026 : 2026లో వివాహ వేడుకలకు సిద్ధమవుతున్న వారికి, ముఖ్యంగా బ్యాచిలర్లకు పండితులు తీపి కబురు అందించారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న శుక్ర మౌఢ్యమి (మూఢం) ముగియడంతో, నేటి నుండి మళ్లీ శుభ ముహూర్తాల సందడి షురూ కానుంది.
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శుక్రుడు ఐశ్వర్యానికి, వివాహ బంధానికి, దాంపత్య సౌఖ్యానికి కారకుడు. అటువంటి శుక్ర గ్రహం సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లినప్పుడు తన ప్రభావాన్ని కోల్పోతుంది, దీనినే ‘శుక్ర మౌఢ్యమి’ లేదా ‘మూఢం’ అంటారు. గతేడాది నవంబర్ 26న ప్రారంభమైన ఈ మౌఢ్యమి కారణంగా గత 83 రోజులుగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు బ్రేక్ పడింది. అయితే, నిన్నటితో (ఫిబ్రవరి 17) ఈ మూఢం ముగియడంతో, నేటి (ఫిబ్రవరి 18) నుంచి శుక్ర బలం చేకూరి శుభ ముహూర్తాలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో మంగళవాయిద్యాల మోతకు ముహూర్తం ఖరారైంది.
మే వరకు వరుస ముహూర్తాలు:
ఫిబ్రవరి 18 నుండి ప్రారంభమయ్యే ఈ శుభ ముహూర్తాల కాలం మే 9వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మూడు నెలల కాలం వివాహాలు, నామకరణాలు, శంకుస్థాపనలు వంటి కార్యక్రమాలకు అత్యంత శ్రేష్టమైనది. ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉండగా, మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో కూడా అత్యధిక రోజులు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయి. అయితే, మే 17 నుంచి జూన్ 15 వరకు ‘అధిక మాసం’ రావడంతో ఆ సమయంలో మళ్లీ శుభకార్యాలకు విరామం తప్పదు. కాబట్టి, ఈ లోపే పనులు పూర్తి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఏడాది పొడవునా ప్రధాన ముహూర్తాల జాబితా:
2026 ఏడాదిలో శుభ ముహూర్తాలు
ఫిబ్రవరి నెల – 19, 20, 21, 24, 25, 26
మార్చి నెల – 1, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్ నెల – 15, 20, 21, 25, 26, 27, 28, 29
మే నెల – 1, 3, 5, 6, 7, 8, 13, 14
జూన్ నెల – 21, 22, 23, 24, 25, 26, 27, 29
జూలై నెల – 1, 6, 7, 11
ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చాతుర్మాస్యం వల్ల శుభ ముహూర్తాలు ఉండవు!
నవంబర్ నెల – 21, 24, 25, 26
డిసెంబర్ నెల – 2, 3, 4, 5, 6, 11, 12
