తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన “మాస శివరాత్రి” మరియు ఆ స్వామి జన్మ నక్షత్రమైన “ఆరుద్ర నక్షత్రం” ఒకేరోజు కలసి రావడం అత్యంత అరుదైన, పవిత్రమైన ఆధ్యాత్మిక ఘట్టంగా భక్తులు భావిస్తున్నారు. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు నదులు, కోనేర్లలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ పవిత్ర దినాన శివునికి మహా న్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చనలు చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో ప్రతి ఆలయం ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలు, సుగంధ పుష్పాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అటు తెలంగాణలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన చారిత్రాత్మక “కోడె మొక్కులు” (ఆవు దూడను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించడం) చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం రెండు ఆలయాల కమిటీలు తాగునీరు, అన్నప్రసాదం మరియు ప్రత్యేక క్యూలైన్ల నిర్వహణతో విస్తృత ఏర్పాట్లు చేశాయి.
