Rajasthan Temple : నవరాత్రుల్లో రాజస్థాన్‌లోని ఈ దేవాలయాలను ద‌ర్శించుకోండి..

రాజ‌స్తాన్‌ (Rajasthan)లోని కొన్ని ఆల‌యాల్లో మాత్రం ప్ర‌త్యేకంగా న‌వ‌రాత్రి సంద‌ర్భంగా విశేష పూజ‌లు జ‌రుగుతుంటాయి.

Rajasthan Temple : నవరాత్రుల సమయంలో, దుర్గామాత దర్శనం కోసం భ‌క్తులు పెద్ద సంఖ్యలో ఆల‌యాల‌కు త‌ర‌లి వ‌స్తుంటారు. భక్తితో, నిష్ట‌తో మాతృమూర్తిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భ‌క్తుల ప్ర‌గాడ విశ్వాసం. ఈ ఉత్సవాల్లో కలశ స్థాపన నుండి ఆడబిడ్డ పూజ వరకు అందరూ అమ్మవారి భక్తిలో లీనమైపోతారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల పూజా విధానాలను అవలంభిస్తుంటారు. దేశంలోని ప్ర‌తి ప్రాంతంలో న‌వరాత్రి ఉత్స‌వాలను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు. రాజ‌స్తాన్‌లోని కొన్ని ఆల‌యాల్లో మాత్రం ప్ర‌త్యేకంగా న‌వ‌రాత్రి సంద‌ర్భంగా విశేష పూజ‌లు జ‌రుగుతుంటాయి. రాజ‌స్థాన్‌ (Rajasthan)లోని ఈ ప్ర‌సిద్ధ దేవాల‌యాల‌ను న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ద‌ర్శించుకుందాం…

కైలా దేవి ఆలయం

రాజస్థాన్‌ (Rajasthan)లోని కరౌలిలో ఉన్న కైలా దేవి మాత ఆలయం ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందింది. ఈ ఆల‌యాన్ని 16వ శతాబ్దంలో రాజా భూపాల్ సింగ్ స్థాపించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయంలో రెండు దేవతా మూర్తి విగ్ర‌హాలు ప్ర‌తిష్టించ‌బ‌డ్డాయి. ఇందులో కైలా దేవి మాత వాలుగా ఉన్న దేవత మూర్తి విగ్ర‌హం. ఈ దేవ‌తా మూర్తి విగ్ర‌హం శ్రీ కృష్ణుని సోదరి యోగమాయ అని ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తులు న‌మ్ముతారు. ఈ దేవత రూపం ద్వారానే నరకాసురుడు చంపబ‌డ్డాడ‌ని ఇక్క‌డివారు చెబుతారు. అందుకే ప్ర‌తిఏటా ద‌స‌రా సంద‌ర్భంగా ఇక్క‌డికి వేలాది మంది భ‌క్తులు త‌ర‌లిస్తుంటారు. న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఈ కైలా దేవి ఆల‌యం విశేష పూజ‌లను అందుకుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

శాకంభరి మాత ఆలయం

శాకంభరి మాత ఆలయం రాజ‌స్థాన్‌ (Rajasthan)లోని జైపూర్ నుండి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆల‌యం సాంబార్ సరస్సు సమీపంలో ఉంటుంది. ఇది ఒక ఉప్పు నీటి స‌ర‌స్సు. ఈ ఉప్పు నీటి సరస్సు నుండి ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉండే విలువైన సంప‌ద అమ్మవారి శాపం కారణంగా ఉప్పుగా మారిందని ఇక్క‌డివారు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇది సాంబార్ సరస్సుగా ప్ర‌సిద్ధి చెందింద‌ని వారు చెబుతుంటారు. శాకంభరి మాత చౌహాన్ రాజవంశపు కుటుంబ దేవత. జైపూర్‌లోని ఈ శాకంభ‌రి మాతా ఆల‌యాన్ని ద‌ర్శించుకునేందుకు ప్ర‌తి ఏటా వేలాది మంది భ‌క్తులు వ‌స్తుంటారు. అయితే ద‌స‌రా న‌వరాత్రి సంద‌ర్భంగా ఈ ఆల‌యంలోని దేవ‌త విశేష పూజ‌ల‌ను అందుకుంటుంది.

త్రిపుర సుందరి మాత ఆలయం

న‌వ‌రాత్రుల్లో కొలిచే దుర్గామాతకు విశేష ఆద‌ర‌ణ ఉంటుంది. ఈ తొమ్మిది అవ‌తారాల్లోని ఒక అవ‌తార‌మే బాలా త్రిపుర సుంద‌రిగా చెప్పుకుంటారు. అయితే రాజ‌స్థాన్‌ (Rajasthan)లోని బన్స్వారాలో కూడా త్రిపుర సుంద‌రి మాతా ఆల‌యం ఉంది. ఈ ఆల‌యంలో న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా విశేష పూజ‌లను చేస్తారు. ఈ ఆల‌యంలో పద్దెనిమిది చేతులతో త్రిపుర సుందరి మాత ప్ర‌త్య‌క్ష‌మై ఉంటారు. ఈ ఆల‌యంలోని అమ్మ‌వారి విగ్రహం నల్లరాతితో చేయబడింది. ఈ దేవాలయం కనిష్కుని పాలనకు ముందే స్థాపించబడిందని ఇక్క‌డి వారు చెబుతున్నారు. పద్దెనిమిది చేతులు క‌లిగిన ఈ మాతాలోని ప్ర‌తి ఒక్క చేతిలో ఒక్కో ఆయుధంతో ఆలంక‌రించ‌బ‌డి ఉంటుంది. ఈ ఆలయంలో త్రిపుర సుంద‌రి మాతా విగ్ర‌హంతో పాటు నవదుర్గ, అరవై నాలుగు యోగినిల విగ్రహాలు కూడా ప్ర‌తిష్టించ‌బ‌డ్డాయి.

కర్ణి మాత ఆలయం

రాజస్థాన్‌లోని బికనీర్ సమీపంలో కర్ణి మాత ఆలయం ఉంది. ఈ దేవాలయం ఎలుకలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దాదాపు 20,000 నల్ల ఎలుకలు నివ‌సిస్తూ ఉంటాయి. ఈ ఆల‌యంలో ఎలుకలను పూజించే సంప్రదాయం ఎప్ప‌టినుంచో కొన‌సాగుతూనే ఉంది. కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఈ ఆలయంలో నివ‌సిస్తున్నాయి. ఈ ఆల‌యంలో ఉండే క‌ర్ణిమాతాను ద‌ర్శించుకోవ‌డంతో పాటు ఇక్క‌డికొచ్చే భ‌క్తులు ఈ ఎలుక‌ల‌ను కూడా పూజిస్తారు. నవరాత్రుల స‌మ‌యంలో సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఇక్క‌డికి వ‌చ్చి ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటుంటారు.

తనోత్ మాతా ఆలయం

త‌నోత్ మాతా ఆల‌యం రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలోని తనోట్ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు చాలా సమీపంలో ఉంటుంది. 1971లో భారతదేశం, పాకిస్తాన్ యుద్ధ సమయంలో, పాకిస్తాన్‌ తనోత్ గ్రామంపై అనేక సార్లు బాంబుదాడుల‌కు గురైంది. అయితే ఒక్క బాంబు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో పడలేదట దానికి కార‌ణం ఈ ఆల‌యంలోని మాతేన‌ని ఇక్క‌డివారి నమ్మ‌కం.అందుకే నిత్యం ఇక్క‌డ ఈ మాతాను భ‌క్తులు పూజిస్తుంటారు.

Also Read:  Dussehra: దసరా నవరాత్రుల్లో గాయత్రి దేవి విశిష్టత గురించి మీకు తెలుసా