Ganesh Chaturthi 2025 : ఇంట్లో వినాయక చవితి..ఆచరించాల్సిన పూజా విధానమిదీ..!

ఈ సందర్భంగా గణేశుడి అనుగ్రహం పొందేందుకు ఎలా పూజించాలి? ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఏ మంత్రాలు జపించాలి? అనే అంశాలపై జ్యోతిష్య నిపుణుడు మాచిరాజు కిరణ్ కుమార్ విశేష వివరాలు ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Vinayaka Chavithi at home..what is the puja method to be performed..!

Vinayaka Chavithi at home..what is the puja method to be performed..!

Ganesh Chaturthi 2025 : వినాయక చవితి అంటే విఘ్నాలను తొలగించే గణనాథుడి జన్మదినమే. భాద్రపద మాసం శుక్ల పక్షం చవితి తిథి రోజున జరుపుకునే ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27, బుధవారం నాడు వస్తోంది. ఈ సందర్భంగా గణేశుడి అనుగ్రహం పొందేందుకు ఎలా పూజించాలి? ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఏ మంత్రాలు జపించాలి? అనే అంశాలపై జ్యోతిష్య నిపుణుడు మాచిరాజు కిరణ్ కుమార్ విశేష వివరాలు ఇచ్చారు.

పూజకు కావలసిన వస్తువులు

పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు, హారతి కర్పూరం, పూలు, తమలపాకులు, బియ్యం, కొబ్బరికాయలు, పండ్లు, బెల్లం, తోరణం, కుందులు (ప్రమిదలు), నెయ్యి, నూనె, వత్తులు, 21 రకాల పత్రి, గరికపోచలు, నైవేద్యాలు.

పూజా విధానం

వినాయక చవితి రోజు తెల్లవారు జామునే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. శుద్ధి కోసం తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించాలి. పూజా మందిరాన్ని పసుపు, కుంకుమ, తోరణాలతో అలంకరించాలి. గణపతిని తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో స్థాపించాలి. ఓ పళ్లెం మీద బియ్యం పోసి, తమలపాకులు వేసిన తర్వాత గణేశుని ప్రతిమను ఉంచాలి. కలశం స్థాపన చేసి దీపారాధన చేయాలి. దీపారాధనలో కొబ్బరి నూనెతో ఐదు వత్తులతో దీపం వెలిగించాలి. వీలైతే జిల్లేడు వత్తులతో దీపం వేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. పూజలో గరికపోచలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అవి జంటగా సమర్పించాలి—వాటిలో ఒకటి సిద్ధి, మరొకటి బుద్ధిగా భావించి పూజ చేయడం శుభదాయకం. 21 రకాల పత్రి దొరకకపోయినా, జంట గరికపోచలతో పూజ చేసినా సమాన ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నైవేద్యాలు

గణేశుడికి ఉండ్రాళ్ల పాయసం అత్యంత ఇష్టమైన నైవేద్యం. అలాగే ఎరుపు రంగు పండ్లు (యాపిల్, దానిమ్మ) సమర్పించాలి. ఈసారి చతుర్థి బుధవారం వస్తోంది కాబట్టి ఆకుపచ్చ రంగు పండ్లు (ద్రాక్ష, నేరేడుపండ్లు) కూడా సమర్పించాలి. ఇది సంవత్సరాంతం శుభ ఫలితాలు అందించగలదని నమ్మకం.

గణపతి పూజా మంత్రాలు

వక్రతుండాయ హూం- ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం. గం క్షిప్రప్రసాదనాయ నమః -మనస్సులో కోరికలు త్వరగా నెరవేరేందుకు ఈ మంత్రాన్ని జపించాలి.

చంద్ర దర్శనం – అపశకున నివారణ

ప్రమాదవశాత్తూ చంద్రుడిని చూసినవారు సింహః ప్రసేనమ వధీః…  అనే శ్లోకాన్ని చదివి పూజా అక్షింతలను తలపై చల్లుకోవాలి. ఇది అపశకునాన్ని నివారిస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక, పైన తెలిపిన పద్ధతులు ప్రాచీన ఆచార సంప్రదాయాలను ఆధారంగా తీసుకొని రూపొందించబడ్డవి. ఇవి శాస్త్రీయ ఆధారాలు కలిగి ఉండకపోవచ్చు. ఈ పద్ధతులను పాటించాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. భక్తి ప్రధానంగా ఉంటే గణపతి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి.అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.

Read Also: TTD : కోట్లాది రూపాయాల టీటీడీ నిధులు వైసీపీ నేతలు మింగేశారు: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

 

 

  Last Updated: 26 Aug 2025, 06:17 PM IST