TTD: తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి లేఖల్ని టీటీడీ స్వీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేడు మొదటిరోజు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చిన సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు అనుమతించగా.. భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్స్ పై టీటీడీ తొలిరోజు 550 నుండి 600 మంది వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే తొలిరోజు భారీగా సిఫార్స్ లేఖలు వచ్చాయి. ఏకంగా 90 లేఖలను భక్తులు తీసుకొచ్చి అదనపు ఈవో కార్యాలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం నమోదు చేసుకోవడం విశేషం. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ప్రతి సోమ, మంగళవారాల్లో ఒక లేఖపై ఆరుగురికి మించకుండా వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. అలాగే బుధ, గురువారాల్లో రూ.300 దర్శన టికెట్లు జారీ చేస్తారు.
తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై మొదటిరోజు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులు
తొలిరోజు 550 నుండి 600 మంది వరకు తెలంగాణా లెటర్స్ పై విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించిన టీటీడీ
శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు గారికి మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి… pic.twitter.com/pVIh3e7dXE
— B R Naidu (@BollineniRNaidu) March 24, 2025
ఇక, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం సోమవారం అనగా మార్చి 24వ తారీఖు నుండి అమలులోకి రానుంది. తెలంగాణ భక్తులకు సిఫార్సు లేఖల ద్వారా శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రజాప్రతినిధులకు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ధన్యవాదాలు తెలిపారు. దర్శనం, మంచి వసతి కల్పిస్తున్న టీటీడీ అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విడుదల చేశారు.
కానీ 2014లో రాష్ట్ర విభజన తరువాత టీటీడీలో మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట తెలంగాణ నేతల సిఫార్సులు చెల్లుబాటు అయ్యేవి. ఆ తరువాత క్రమంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శనాలు నిలిపివేయడం దుమారం రేపింది. తిరుమలలో తెలంగాణ నేతలకు అవమానాలు అంటూ ఎంపీ రఘునందన్ రావు, మంత్రులు కొండా సురేఖ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఆరోపించారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 294 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు అయ్యేవి. సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తులను శ్రీవారి బ్రేక్ దర్శనాలకు అనుమతించేవారు.