తిరుపతి(Tirupathi)లోని జూపార్క్ రోడ్డులో నిర్మితమవుతున్న ముంతాజ్ హోటల్(Mumtaz Hotel)పై గత కొద్దీ రోజులుగా వివాదం నడుస్తుంది. హిందువుల మనోభావాలకు విరుద్ధంగా ఈ హోటల్ నిర్మాణం జరుగుతోందని పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తూ , హోటల్ అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరుతూ వస్తున్నారు. టీటీడీ, తిరుపతి పవిత్రతను దెబ్బతీయడానికి గత వైసీపీ ప్రభుత్వం దేవలోక్‌లో 60 ఎకరాల్లో 20 ఎకరాలు ముంతాజ్ హోటల్స్‌కు కేటాయించిందని , ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఈ 20 ఎకరాల్లో వంద విల్లాలను ముంతాజ్ హోటల్ యాజమాన్యం నిర్మించనుందని, అక్కడ విచ్చలవిడిగా మద్యం, మాంసం లాంటి విష సంస్కృతిని పెంపొందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని తిరుక్షేత్రాల రక్షణ సమితి, రాయల్ పీపుల్ ఫ్రంట్‌ల అధ్యక్షులు తుమ్మా ఓంకార్, రెడ్డిశేఖర్ రాయల్ పేర్కొన్నారు. ఈ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
దీనిపై తాజాగా TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అలిపిరి సమీపంలో దేవలోకం పేరుతో ఓ భారీ పర్యాటక ప్రాజెక్ట్‌ను నిర్మించ తలపెట్టిందని, దీనికోసం అప్పట్లో 60 ఎకరాలను కేటాయించిందని గుర్తు చేసారు. 2019 తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దీన్ని మార్చివేసిందని, దేవలోకం ప్రాజెక్ట్‌కు కేటాయించిన 60 ఎకరాల్లో 20 ఎకరాలను ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి మంజూరు చేసిందని వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిందని, మళ్లీ ఈ వివాదం తెర మీదికి వచ్చిన నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలని తీర్మానించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. ఈ తీర్మానాన్ని టీటీడీ పాలక మండలి సమావేశంలో సైతం ఆమోదించామని ఆయన అన్నారు. ముంతాజ్ హోటల్స్‌కు కేటాయించిన స్థలం లీజును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోన్నామని తెలిపారు.
Read Also : 2025 Sankranti Movies : సంక్రాంతి బరిలో ఆ ముగ్గురేనా..?