బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో మంగళవారం ఉదయం పెను విషాదం సంభవించింది. మఘ్పా గ్రామంలోని ప్రసిద్ధ శీతలాష్టమి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో, అమ్మవారిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని వేల సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి పోటెత్తారు. ఆలయ సామర్థ్యానికి మించి జనం రావడం, దానికి తగ్గట్లుగా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు ఒక్కసారిగా గర్భాలయం వైపు దూసుకురావడంతో తోపులాట మొదలై, ఊపిరాడక ఎనిమిది మంది మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం స్థానికులను కలచివేసింది.
ఆర్తనాదాలతో మారుమోగిన ఆలయ ప్రాంగణం
తొక్కిసలాట జరిగిన సమయంలో ఆలయ ప్రాంగణం యుద్ధభూమిని తలపించింది. తోపులాటలో కిందపడిపోయిన వారిపై నుంచి జనం పరుగులు తీయడంతో భయానక వాతావరణం నెలకొంది. ప్రాణ భయంతో భక్తులు వేసిన కేకలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. స్పృహ కోల్పోయిన మహిళలను కాపాడేందుకు తోటి భక్తులు చేసిన ప్రయత్నాలు కన్నీళ్లు పుట్టించాయి. కొందరు ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడుతుండగా, మరికొందరు వారికి సీపీఆర్ చేస్తూ, ముఖంపై నీళ్లు చల్లుతూ కాపాడే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన వెంటనే తగినన్ని అంబులెన్స్‌లు గానీ, వైద్య సదుపాయాలు గానీ అందుబాటులో లేకపోవడం వల్ల గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం
ఈ ప్రమాదానికి పోలీసుల విఫలమే ప్రధాన కారణమని క్షేత్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి మంగళవారం భక్తుల రద్దీ ఉంటుందని తెలిసినప్పటికీ, కనీస బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం, జన నియంత్రణకు సరిపడా సిబ్బందిని కేటాయించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన చాలాసేపటి తర్వాత అధికారులు చేరుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గాయపడిన డజనుకు పైగా భక్తులను బీహార్ షరీఫ్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినప్పటికీ, పోయిన ప్రాణాలు తిరిగి రావని, భవిష్యత్తులోనైనా పండుగలు, ఉత్సవాల సమయంలో భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
