Rama Ekadashi : ఇవాళ (అక్టోబరు 28) రామ ఏకాదశి. ఈ ఏకాదశి ఏటా కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది. మనం ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు ముందు రామ ఏకాదశిని జరుపుకుంటాం. శ్రీ మహా విష్ణువుకు మరో రూపమైన రాముడి పేరిట దీన్ని ‘రామ ఏకాదశి’(Rama Ekadashi) అని పిలుస్తారు. ఈ రోజున రామభక్తులు ఉపవాసం పాటిస్తారు. బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి దక్షిణ సమర్పించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. దీనివల్ల జీవితంలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టఐశ్వర్యాలు కలుగుతాయని అంటారు.
పూజా విధానం
- ఇంట్లోని పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి.
- విష్ణుమూర్తికి జలాభిషేకం చేయాలి. పంచామృతం, గంగాజలంతో స్వామి వారికి అభిషేకం చేయాలి.
- పసుపు చందనం, పసుపు పుష్పాలను స్వామివారికి సమర్పించాలి.
- గుడిలో నెయ్యి దీపం వెలిగించాలి.
- ఉపవాసం ఉండాలి.
- రామ ఏకాదశి శీఘ్ర కథను చదవాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండి పుణ్యం లభిస్తుంది.
- ‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’’ అనే మంత్రాన్ని జపించాలి.
- లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి.
- తులసితో విష్ణుమూర్తికి భోగం సమర్పించాలి. అయితే ఏకాదశి రోజు తులసి ఆకులను తెంపకూడదు.
రామ ఏకాదశి రోజు ఏం చేయకూడదు?
- ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం తీసుకోవద్దు.
- ఎవరిపైనా కోపం తెచ్చుకోకూడదు. వాదనలకు దిగొద్దు.
- రాత్రి జాగరణతో ఉండి, విష్ణువు స్తోత్రాలు, కీర్తనలు చదవాలి.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.