Putrada Ekadashi : పండుగల మాసంగా పేరొందిన శ్రావణ మాసంలో ఇవాళ స్పెషల్. ఈరోజు (ఆగస్టు 27) పుత్రదా ఏకాదశి. దీన్ని విష్ణుభక్తులు నియమ నిష్టలతో చేసుకుంటారు. శ్రీమహావిష్ణువు, లక్ష్మిదేవిని, తులసిని పూజిస్తారు. 24 ఏకాదశి ఉపవాసాలలో.. పుత్రదా ఏకాదశి ఉపవాసం ఒకటి. పుత్రదా ఏకాదశి విశిష్టత గురించి భవిష్య పురాణంలో ప్రస్తావించారు. దాని ప్రకారం.. పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడట. ధనానికీ, ధాన్యానికీ ఆ రాజ్యంలో ఎలాంటి లోటూ లేదు. కానీ రాజుగారికి సంతానం లేదు. దీంతో ప్రజలంతా బాధగా ఉండేవారు. మహిజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలగలేదు. దీంతో రాజ్య ప్రజలు లోమశుడు అనే మహర్షి దగ్గరికి వెళ్లి.. ఏ వ్రతాన్ని ఆచరిస్తే తమ రాజుకు పుత్రసంతానం కలుగుతుందో చెప్పాలని అడుగుతారు. శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే… రాజుగారికి సంతానం కలిగితీరుతుందని లోమశుడు సూచిస్తాడు. లోమశుని సూచన మేరకు రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు ఈ వ్రతాన్ని ఆచరించారు. దీంతో రాజుగారికి పుత్రసంతానం ప్రాప్తించింది. అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశిగా (Putrada Ekadashi) పిలుస్తున్నారు.
Also read : Today Miracle In Space : ఇవాళ రాత్రి శనిగ్రహాన్ని చూసే ఛాన్స్.. ఎలా చూడాలో తెలుసా ?
పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశినాడు రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ, విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణుసహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో పూజించాలి. ఆ ఏకాదశి రోజు రాత్రివేళ జాగరణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఇలా జాగరణ చేసిన మర్నాడు ఉదయాన్నే, దగ్గరలోని ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెబుతారు. సంతాన భాగ్యం కూడా ప్రాప్తిస్తుంది. ఈ శ్రావణశుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు కుబేరుని జన్మదినం అని అంటారు. సిరిసంపదలకు అధిపతి అయిన కుబేరుని కనుక ఈ రోజున పూజిస్తే, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.