Varahi Ammavaru: వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

వారాహి అమ్మవారి విషయాలు: వారాహి అమ్మవారిని శక్తి స్వరూపాలలో ఒకరిగా చెప్తారు. ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా, అలాగే దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితా దేవి తరఫున పోరాడటానికే కాదు, భక్తులకు అండగా నిలిచే ఒక గొప్ప యోధురాలిగా వారాహి నిలుస్తుంది. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, అపార జ్ఞానం […]

Published By: HashtagU Telugu Desk
Surprising facts about Goddess Varahi

Surprising facts about Goddess Varahi

వారాహి అమ్మవారి విషయాలు:

వారాహి అమ్మవారిని శక్తి స్వరూపాలలో ఒకరిగా చెప్తారు. ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా, అలాగే దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితా దేవి తరఫున పోరాడటానికే కాదు, భక్తులకు అండగా నిలిచే ఒక గొప్ప యోధురాలిగా వారాహి నిలుస్తుంది.

ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలినీ శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహి దేవి పేరు ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Varahi Ammavaru

వారాహి దేవి నల్లని కాంతితో, వరాహ ముఖంతో, మహిష వాహనంతో, పెద్ద పొట్టతో, ఎనిమిది చేతులలో శంఖం, చక్రం, నాగలి, గునపం, అభయ, వరద ముద్రలతో ఉంటుంది. ఈమెను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవీ మాహాత్మ్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది.

అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె వాహనం గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని తన దంతాలతో రాక్షస సంహారం చేస్తుంది.

Varahi Ammavaru.

గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి దేవి. మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం సర్వసాధారణం. వామాచారం పాటించే భక్తులు రాత్రి పూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూరక, స్వాధిష్ఠాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది.

వారాహిమాతను ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో, తెల్లవారుజాముననో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్‌లలో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత. వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత ఈమె. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలు పడదు.

Kiratha Varahi Mantram

ఈ ఆలయం ఒక భూగర్భ గృహంలో ఉంటుంది. తెల్లవారుజామున 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెలుతుందంట! అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటారు. ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళ్తే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఒక రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది.

మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిని కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెప్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పం ఉగ్ర కళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది.

ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది. ఇలా ఉగ్రరూప ధారిణి అయినా అమ్మవారిని చూడటం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారం కోసం వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ కు ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం. ఈ వారాహి దీవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెప్తారు. అఘోరాలు, తాంత్రిక సిద్ధులకై రాత్రివేళల్లో ఈ అమ్మవారిని పూజిస్తారు.

 

  Last Updated: 26 Jun 2026, 12:22 PM IST