Site icon HashtagU Telugu

Shravana Masam 2023: శ్రావణ శుక్రవారం ప్రత్యేకతలేంటి..? వ్రతం ఎందుకు చేయిస్తారు..?

Shravana Masam 2023

Compressjpeg.online 1280x720 Image (1)

Shravana Masam 2023: హిందూ మతంలో ప్రతి ఒక్క మాసానికి ఒక విశిష్టత ఉంది. అయితే శ్రావణ మాసానికి (Shravana Masam 2023) ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ మాసాన్ని ఉపవాసాలు, పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ కాలంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులు, వంకలు, సరస్సులు, చెరువులు, నదులు పొంగి పొర్లుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం.. ఆగస్టు 17వ తేదీ నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఉంటుంది.

ఈ నెలలో సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాల పూజలు, నోములు, వ్రతాలతో దాదాపు నెలరోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ నెలలో శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. ఈ కాలంలో చంద్రుని నుండి కలిగే అశుభ ఫలితాల నుండి తప్పించుకునేందుకు, మానసిక శాంతిని కాపాడుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రావణ మాసంలో అనేక పండుగలు, పూజలు, వ్రతాలు జరుపుకుంటారు.

హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మంగళ గౌరి దేవిని కలశ రూపంలో ప్రతిష్టించి, మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. రక రకాల పిండి వంటలతో పాటు పండ్లను, పూలను అమ్మవారికి సమర్పిస్తారు. కొందరు తమ ఇళ్లల్లోనే ముత్తయిదవులను ఆహ్వానించి వ్రతాన్ని చేస్తారు.

Also Read: Benefits of Fasting: ఉపవాసం ఉండటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..!?

శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.