Site icon HashtagU Telugu

Shivratri Jagaram : శివరాత్రి జాగారంలో ఈ మంత్రాలను జపించండి..!

shivratri mantras

shivratri mantras

Shivratri Jagaram : మహాశివరాత్రి.. ఈ రోజున శైవక్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోతాయి. ఉపవాసం చేయడంతో పాటు ఎంతోమంది భక్తులు జాగారం కూడా చేస్తారు. శివరాత్రి జాగారం అంటే.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటం కాదు. రోజంతా శివనామాన్ని స్మరిస్తూ, శివమంత్రాలను జపిస్తుండాలి. శివరాత్రి జాగారం చేసేవారు శివ మంత్రాలను జపిస్తే.. మనఃశ్శాంతితో పాటు.. ఆ లయకారుడి కృప, కటాక్షాలు కలుగుతాయి.

శివమంత్రం అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ఓం నమః శివాయ. శివ పంచాక్షరి మంత్రమిది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనసు, శరీరం, ఆత్మను నిష్కల్మషంగా ఉంచుకోవచ్చు. మహాశివరాత్రి జాగారంలో 108 సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే ఆ శివుడు మీ కోరికలను తీరుస్తాడు.

మృత్యుంజయ మంత్రం

ఎంతటివారికైనా సరే మరణభయం సహజం. ఆ మరణ భయాన్ని తొలగించేది మహా మృత్యుంజయ మంత్రం. దీనిని మృత సంజీవని అని కూడా అంటారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల దీర్ఘాయుష్షుతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. అకాల మరణం వాటిల్లకుండా రక్షిస్తుంది.

ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్థనం
ఉర్వారుక మివ బంధనాన్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్

శివ రుద్రమంత్రం – ఓం నమో భగవతే రుద్రాయ నమః

రుద్రుడు శివుడి ఉగ్రరూపం. ఈ మంత్రాన్ని జపిస్తే.. శివ భక్తుడు తనను రక్షించమని, ఆశీర్వదించమని, ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని కలిగించమని శివుడిని అడుగుతున్నట్లు అర్థం.

శివగాయత్రీ మంత్రం

ఓం తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, తన్నో రుద్ర ప్రచోదయాత్.. పురాతన శివమంత్రాల్లో ఇదీ ఒకటి. ఈ మంత్రాన్ని జపిస్తే శివుడు భక్తులకు జ్ఞానోదయాన్ని, తెలివిని అనుగ్రహిస్తారు.

శివ యజుర్ మంత్రం

కర్పూర గౌరం కరుణావతారం, సంసార సారం భుజగేంద్ర హారం
సదా వసంతం హృదయాన విందే, భవం భవానీ సహితం నమామి
ఈ మంత్రాన్ని శివుడికి హారతినిచ్చేటపుడు జపిస్తారు. శివభక్తుడు మంత్రాన్ని జపిస్తూ ఉంటే శివపార్వతులు ఆనందంగా వింటారు.

Also Read : Shivratri Fasting Foods : శివరాత్రి ఉపవాసం పూర్తయ్యాక వీటిని అల్పాహారంగా తినొచ్చు..