Site icon HashtagU Telugu

TTD : తిరుమలలో సిఫారసు లేఖలకు అనుమతి లేదు: వైవీ సుబ్బారెడ్డి

Ttd Chairman Yv Subbareddy

Ttd Chairman Yv Subbareddy

తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత నిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తున్నామని, ఈ పది రోజులు వీఐపీలు సిఫారసు లేఖలతో రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వీఐపీలు, వారి కుటుంబ సభ్యులు మామూలుగా వస్తే వారికి నియమావళి ప్రకారం దర్శన ఏర్పాట్లు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

ముఖ్యంగా, వైకుంఠ ఏకాదశి (జనవరి 2) సందర్భంగా సిఫారసు లేఖలు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇక వైకుంఠద్వార దర్శనం గురించి వివరణ ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాలతో, మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు పాటించి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం కల్పిస్తున్నామని టీటీడీ (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ పద్ధతి గతేడాది నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు.

ఈసారి సాధ్యమైనంత ఎక్కువమంది సామాన్య భక్తులకు స్వామివారిని వైకుంఠద్వారం నుంచి దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. భక్తులు క్యూలైన్లలో అత్యధిక సమయం పాటు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, తిరుపతిలోనే 9 కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు అందిస్తున్నామని వివరించారు.

టోకెన్ తీసుకుని తిరుమల కొండపైకి వస్తే మూడ్నాలుగు గంటల్లోనే స్వామి దర్శనం పూర్తవుతుందని, తర్వాత వారు కిందికి వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పారు. తిరుమల కొండపై భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు ఈ నిబంధనను గమనించాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Also Read:  Vaikuntha Ekadashi : ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే…