Shirdi Sai Baba: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్‌కు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. క్రిస్మస్ సెలవులు, పాత ఏడాది వీడ్కోలు, కొత్త ఏడాది స్వాగత వేడుకల సందర్భంగా భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడంతో కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే సుమారు రూ. 23.29 కోట్ల ఆదాయం సమకూరినట్లు సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష గాడిల్కర్ వెల్లడించారు.
విరాళాల పూర్తి వివరాలు
సంస్థాన్ తెలిపిన గణాంకాల ప్రకారం వివిధ మార్గాల ద్వారా అందిన ఆదాయం ఇలా ఉంది. హుండీల ద్వారా రూ. 22.02 కోట్లు, డొనేషన్ కౌంటర్ల ద్వారా రూ. 3.22 కోట్లు, పి.ఆర్ టోల్ పాస్ ద్వారా రూ. 2.42 కోట్లు అందినట్లు తెలిపారు. డెబిట్/క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ విరాళాలు, చెక్కులు, డిడిల ద్వారా రూ. 10.18 కోట్లు సమకూరాయి. ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల నుండి వచ్చిన భక్తులు విదేశీ కరెన్సీ రూపంలో రూ. 16.83 లక్షలు సమర్పించారు. భక్తులు సుమారు రూ. 36.38 లక్షల విలువైన 293.91 గ్రాముల బంగారం, రూ. 9.49 లక్షల విలువైన సుమారు 6 కిలోల వెండిని కానుకగా ఇచ్చారు.
Also Read: విజయ్ చివరి మూవీ ట్రైలర్ విడుదల.. భగవంత్ కేసరి రీమేకే?
వైభవంగా వజ్రాల కిరీటం
నూతన సంవత్సర తొలిరోజున ఒక భక్తుడు సాయిబాబా పాదాల చెంత అత్యంత విలువైన బంగారు-వజ్రాల కిరీటాన్ని సమర్పించారు. 655 గ్రాముల బరువున్న ఈ కిరీటం విలువ సుమారు రూ. 80 లక్షలుగా అంచనా వేస్తున్నారు. ఇందులో 585 గ్రాముల స్వచ్ఛమైన బంగారం, 153 క్యారెట్ల ఖరీదైన వజ్రాలు పొందుపరిచారు.
అన్నప్రసాదం- లడ్డూల విక్రయం
ఈ ఉత్సవాల సమయంలో సాయిబాబా ప్రసాదాల పంపిణీ కూడా భారీ స్థాయిలో జరిగింది. సుమారు 6 లక్షల మందికి పైగా భక్తులు సాయి ప్రసాదాలయంలో ఉచిత భోజనం స్వీకరించగా, లక్ష మందికి పైగా ఫుడ్ ప్యాకెట్లను పొందారు. సుమారు 7.67 లక్షల లడ్డూ ప్రసాదం ప్యాకెట్ల విక్రయం ద్వారా రూ. 2.30 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే 5.76 లక్షల మంది భక్తులకు ఉచితంగా బూందీ ప్రసాదం పంపిణీ చేశారు.
విరాళాల వినియోగం
ఈ విరాళాలను సాయిబాబా ఆసుపత్రి, సాయినాథ్ ఆసుపత్రి నిర్వహణకు ప్రసాదాలయంలో ఉచిత భోజన వసతికి, విద్యా సంస్థల నిర్వహణకు, భక్తుల సౌకర్యార్థం చేపట్టే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని సిఈఓ గాడిల్కర్ తెలిపారు.
