Hyderabad Bonalu : 7 నుంచి బోనాల వేడుకలు.. గోల్కొండ జగదాంబికకు తొలి బోనం

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగ జులై 7న(ఆదివారం రోజు) ప్రారంభం కాబోతోంది.

  • Written By:
  • Updated On - July 4, 2024 / 04:55 PM IST

Hyderabad Bonalu : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగ జులై 7న(ఆదివారం రోజు) ప్రారంభం కాబోతోంది. ఆ రోజున హైదరాబాద్‌లోని గోల్గొండ జగదాంబికకు భక్తులు తొలి బంగారు బోనం సమర్పిస్తారు. ఈసందర్భంగా పంచామృతాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. దీంతో బోనాల వేడుకలు మొదలవుతాయి. ఆ తర్వాత వచ్చే ప్రతి ఆదివారం, గురువారం బోనాల జాతర జరుగుతుంది. ఈ ఏడాది జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు బోనాల వేడుకలు కొనసాగుతాయి.  జులై 11న రెండో పూజ  (ఒడి బియ్యం, బోనాల సమర్పణ), జులై 14న మూడో పూజ (తొట్టెల సమర్పణ), జులై 18న నాలుగో పూజ (నవధాన్యాలతో పూజ) , జులై 21న ఐదో పూజ (శాఖాంబరి పూజ), జులై 25న ఆరో పూజ (కల్లు, సాక సమర్పణ), జులై 28న ఏడో పూజ (శావా కార్యక్రమం), ఆగస్ట్ 1న ఎనిమిదో పూజ (కులవృత్తుల ఆధ్వర్యంలో శాంతి పూజ) జరుగుతాయి. ఆగస్టు 4న చివరగా తొమ్మిదో పూజ జరుగుతుంది. లష్కర్ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ, లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయాల్లో జరిగే బోనాలతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. గోల్కొండ కోటలోనే చివరి రోజున జరిగే పూజ‌తో భాగ్యనగరంలో బోనాల(Hyderabad Bonalu) సందడి ముగుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు జూలై 21,22 తేదీల్లో జరుగుతాయి.
  • పాత‌బ‌స్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు స‌హా అన్ని ఆల‌యాల్లో జులై 19న బోనాల జాత‌ర ఉత్స‌వాలు ప్రారంభం అవుతాయి.
  • జూలై 29న శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయం వద్ద అంబారీపై ఊరేగింపు ఉత్సవం, తర్వాత ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు.

Also Read :Indian Movies – Japan : జపాన్‌లో దుమ్ము లేపేందుకు ఇండియా సినిమాలు రెడీ

బోనాల సందర్భంగా కొత్త మట్టి కుండ లేదా కొత్త పాత్రలో పాలు, బెల్లం, బియ్యం వేసి పరమాన్నం చేస్తారు. అలాగే ఆ కుండను లేదా పాత్రను వేప ఆకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. డప్పుచప్పుళ్ల నడుమ ఈ కుండను తలపై మోస్తూ ఆలయాలకు తీసుకెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు.  బోనాల వేడుకలలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భవిష్యవాణి రంగం అనే కార్యక్రమాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.

బోనాల వేడుక – ఆరోగ్య ప్రయోజనాలు.. 

  • వేపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పరగడపునే వేపాకులు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఎన్నో చర్మవ్యాధులకు వేప దివ్యఔషధంలా పనిచేస్తుంది. బోనాల అలంకరణకు వేపాకులనే వినియోగిస్తుంటారు.
  • క్యాన్సర్ ని నిరోధించడంలో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పసుపు ఎక్కువగా వినియోగిస్తే కీమోథెరఫీ మెరుగ్గా పనిచేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని పసుపు మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడే శక్తి పసుపుకు ఉంది. బోనాల తయారీలో పసుపు వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. మన రోగ నిరోధక శక్తి పెరగడానికి పసుపు దోహదం చేస్తుంది.

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.