Theertham : గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకున్న తరువాత, తీర్థప్రసాదాలు కళ్లకి అద్దుకుని స్వీకరించడం జరుగుతుంది. తీర్థప్రసాదాలు తీసుకోవడం వల్లనే ఆలయ దర్శనం యొక్క ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందని భావిస్తుంటారు. తీర్థప్రసాదాలు అనేవి ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ వుంటాయి.
కొన్ని ప్రాంతాల్లో తులసినీరు … కోనేటినీరు … పాలు … పానకం … అభిషేకం చేయబడిన పంచామృతాలు తీర్థంగా ఇస్తుంటారు. ఇక గురువాయూర్ లో నువ్వుల నూనెను తీర్థంగా ఇస్తుంటారు. ఇక తిరుమల … శ్రీ కాళహస్తి … శిరిడీ … పూరీ … శబరిమలై వంటి క్షేత్రాల్లో ప్రసాదం ప్రత్యేకతను సంతరించుకుని వుంటుంది.
ఇలా ప్రాంతాలు దాటుకుని వెళుతున్నాకొద్ది అక్కడి పద్ధతిని అనుసరిస్తూ తయారు చేయబడిన తీర్థప్రసాదాలు కొత్తగా అనిపిస్తూ వుంటాయి. అయితే కొందరు ఆ తీర్థ ప్రసాదాలను అదోలా చూడటం … వాటిని తీసుకోకుండానే రావడం చేస్తుంటారు. ఇంకొందరు అయిష్టంగా తీర్థం తీసుకుని … పరిచయంలేని రుచి కావడం వలన ప్రసాదాలను కొంచెం తిని మిగతాది పారేస్తుంటారు.
ఈ విధంగా చేయడం ఆ క్షేత్రాన్ని … అక్కడి దైవాన్ని అవమానపరిచినట్టు అవుతుంది. అలా వ్యవహరించినందుకు దోషాన్ని మూటగట్టుకో వలసి వస్తుంది. అందువలన తీర్థ ప్రసాదాల విషయంలో ఆయా ప్రాంతాల పద్ధతులను దృష్టిలో పెట్టుకుని, భక్తి శ్రద్ధలతో స్వీకరించడం చేయాలి. అప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడు … తన దర్శన ఫలితాన్ని అందజేస్తాడు.
