Saraswati River Mystery: సరస్వతీ నది పుష్కరాలు తెలంగాణలో ఈరోజు (మే 15న) ప్రారంభమయ్యాయి. ఈ నది గురించి వేదాల్లోనూ ప్రస్తావన ఉంది. రుగ్వేదంలోని 45వ శ్లోకంలో సరస్వతీ నది పేరును 72 సార్లు ప్రస్తావించారు. ‘‘సరస్వతీ నది నిండుగా ప్రవహిస్తోంది’’ అని అందులో కీర్తించారు. ‘‘యమున, సట్లేజ్ నదుల మధ్యన సరస్వతీ నది ప్రవహిస్తోంది’’ అని రుగ్వేదం 10వ మండలంలో ఉన్న 5వ శ్లోకంలో పేర్కొన్నారు. ‘‘పర్వతం నుంచి సముద్రంలోకి సరస్వతీ నది సాగిపోతోంది’’ అని రుగ్వేదం 17వ మండలంలో ఉన్న 95వ శ్లోకంలో ఉంది. కట్ చేస్తే.. ఇప్పుడు సరస్వతీ నది అదృశ్యమైంది. ఇంతకీ అది ఏమైంది ? దాని గురించి ఇస్రో ఏం చెబుతోంది ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :President Murmu : రాష్ట్రపతి, గవర్నర్లకు ‘సుప్రీం’ డెడ్‌లైన్ పెట్టొచ్చా.. ముర్ము 14 ప్రశ్నలు
త్రివేణి సంగమం.. సరస్వతీ నది ఏమైంది ?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్ రాజ్ ఉంది. అక్కడే త్రివేణీ సంగమం ఉంది. త్రివేణీ సంగమం అంటే మూడు నదులు కలిసే చోటు. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే స్థానం కావడం వల్లే దీనికి త్రివేణీ సంగమం అనే పేరొచ్చింది. గంగా,యమున నదులు ఇంకా ఉన్నాయి. మరి సరస్వతీ నది ఏమైంది ? అనే ప్రశ్న మిస్టరీగా మిగిలిపోయింది.
హర్యానాలో పుట్టి.. కచ్‌లో కలిసి..
సరస్వతీ నది హర్యానాలో పుట్టి, గుజరాత్‌లోకి ప్రవేశించి సముద్రంలో కలిసేదని అంటారు. ఇటీవలే ఈ నది ఆనవాళ్లను భౌగోళికంగా, పురావస్తు ఆధారాల పరంగా కనుగొన్నారు. హర్యానాలో ప్రస్తుతం సరస్వతి పేరుతో ఒక నది ఉంది. అయితే వేదాల్లో పేర్కొన్నట్టుగా అది పర్వతాల్లో పుట్టలేదు. సముద్రంలో కూడా కలవదు. హర్యానాలోని యమునానగర్‌లో ఉన్న ఆదిబద్రిలో సరస్వతీ నది(Saraswati River Mystery) జన్మించిందని ప్రజలు నమ్ముతారు. ఈ నది హరియాణా, రాజస్థాన్, పాకిస్తాన్ మీదుగా ప్రవహించి శివాలిక్ పర్వత శ్రేణుల వద్ద కచ్ సమీపంలో సముద్రంలో కలుస్తుందని అంటారు.
Also Read :Radiation Leak : భారత్ దాడితో పాక్‌లో రేడియేషన్ లీక్.. అమెరికా, ఈజిప్ట్ ఏం చేశాయంటే..
ఆప్ఘనిస్తాన్‌లో ఉందా ?
‘‘సరస్వతీ నది అనేది తూర్పు ఆప్ఘనిస్తాన్‌లో ఉన్న ‘హరక్స్వతి’ నది అయి ఉండొచ్చు. రుగ్వేదాన్ని రచించిన తొలితరం వారు సింధునాగరికతలోకి ప్రవేశించకముందు హరక్స్వతి నది ఒడ్డున నివసించి ఉండొచ్చు. సరస్వతీ నది పేరు కచ్చితంగా ‘హరక్స్వతి’ నది నుంచే పుట్టి ఉండొచ్చు’’ అని విద్యావేత్తలు హబీబ్, రోమిల్లా థాపర్, రాజేష్ కొచ్చర్ అభిప్రాయపడ్డారు.
ఇస్రో ఏం చెబుతోంది ? రీసెర్చ్‌లో ఏం తేలింది ?
‘‘మేం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 120 నుంచి 151 మీటర్ల లోతున బోర్లు తవ్వితే 14 ప్రదేశాలలో భూగర్భజల జాడను కనుగొన్నాం. రాజస్థాన్‌లోని జైసల్మీర్ నుంచి 10 ప్రాంతాలలో భూగర్భనీటి నమూనాలను తీసుకున్నాం. వీటిని బాబా న్యూక్లియర్ పరిశోధనా కేంద్రంలో విశ్లేషించి చూశాం. ఈ నీరు 1900 నుంచి 18800 సంవత్సరాల కిందటిది అని గుర్తించాం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లోని ‘దుషద్వతి’ నది భూగర్భ ఒడ్డుకు ఇరువైపులా వివిధ యుగాలకు చెందిన పురాతనస్థావరాలు సరస్వతీ నది చుట్టూ ఉన్నాయని కనుగొన్నాం’’ ఓ అధ్యయన నివేదికలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వెల్లడించింది. పరిశోధకులు రేడియోకార్బన్ డేటింగ్ చేసినప్పుడు హిమాలయాల నుంచి కచ్ వరకు సరస్వతీ నది ద్వారా అవక్షేపాలు ప్రవహించినట్టు గుర్తించారు. దీన్నిబట్టి సరస్వతి నది వర్షాధారమైంది కాదని, అదొక హిమానీ నదమని తేలింది. కాలం గడిచేకొద్దీ సింధు, సరస్వతి నదులు పశ్చిమంవైపు మళ్లాయని వెల్లడైంది. థార్ఎడారి విస్తరణ వల్లే సరస్వతీ నది అదృశ్యమైనట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.