Site icon HashtagU Telugu

Sai Baba: ఓ సాయి భక్తురాలి అనుభవాలు..

Experiences Of O Sai Bhakturali..

Experiences Of O Sai Bhakturali..

బాబా! గత 17 సంవత్సరాలుగా మీరు నాకు తోడుగా ఉన్నారు, అందుకు మీకు నా ధన్యవాదాలు. నేను ఎప్పుడూ మీ పవిత్ర పాదాల చెంతే ఉన్నాను. నన్ను, నా కుటుంబాన్ని వదిలి వేయకండి. మీరు లేనిదే నేను లేను.

పేరు తెలియజేయని ఒక సాయి భక్తురాలి అనుభవాలు: ప్రియమైన సాయి బంధువులందరికీ నేను జనవరి, 2017లో నాకు జరిగిన కొన్ని అనుభవాలు తెలియజేస్తాను.

అనుభవము 1: 

జనవరి నెల మధ్యలో నేను నా కొడుకుతో మా పుట్టింటికి వెళ్లాను. నేను గర్భం దాల్చిన తరువాత చాలా తరచుగా అనారోగ్యం పాలవుతుండటంతో చాలా డిప్రెస్డ్ గా ఉన్నాను. 4 సంవత్సరాలుగా నేను ఏదో ఒక అనారోగ్యం, విటమిన్ లోపం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా బలహీనంగా ఉన్నాను. ఒకరోజు చాలా ఏడ్చి, “బాబా ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు?” అని నా తల్లిని అడిగాను. “నేను ఆయనను ఎంతో ప్రార్ధిస్తున్నాను, కానీ ఆయన నా ప్రార్ధనలకు సమాధానం ఇవ్వటం లేదు. బాబా నిజంగా దయగల వారైతే, నా ప్రార్ధనలు వింటూ ఉంటే ఆయన ఉదయం 10 గంటలకు ముందు వచ్చి నాకు జవాబివ్వాలి” అని మా అమ్మతో అన్నాను. మా అమ్మ నా బాధ చూసి, “ఆయన ఖచ్చితంగా వచ్చి నీకు సమాధానం చెప్తారు” అని చెప్పింది.

నేను 9గంటల సమయంలో పూజ చేస్తూ దీపాలు వెలిగించాను. అప్పుడే తన కుమార్తె వివాహానికి ధన సహాయం కోసం ఒక వృద్ధుడు వచ్చాడు. అతను ఎవరైనప్పటికీ, మేము అతనికి సహాయం చేయాలని భావించాము. నేను అతనికి రెండువేల రూపాయలు ఇచ్చి, పూజ కొనసాగించాను. మా అమ్మ అతనికి కాఫీ ఇచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. నేను పూజ పూర్తి చేసి, ఆరతి మా తల్లిదండ్రులతోపాటు అతనిని కూడా తీసుకోమని చెప్పాను. అతను ఆరతి తీసుకోకుండా, మనం మన పిల్లలకి ఎలా ఇస్తామో అలా తన చేతులతో ఆరతి నాకు చూపించారు. ఒకవేళ ఎవరైనా పెద్ద వయస్సులో ఉంటే, వారు ముందు ఆరతి తీసుకొని తర్వాత తమ పిల్లలకు చూపిస్తారు. నేను అతను వేరెవరో కాదు బాబాయే అని, నన్ను ఆయన ఆశీర్వదించారని భావించాను. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే నా మనస్సు ఆనందంలో మునిగిపోతుంది.

అనుభవము 2:

జనవరి మధ్యలో అదే వారంలో హైదరాబాదు అల్వాల్ లో చాలా ప్రసిద్ధి చెందిన నాగదేవత ఆలయానికి నా మ్రొక్కు తీర్చుకోవటానికి వెళ్లాను. వెళ్లేముందు అలవాటు ప్రకారం నేను బాబాను నాతో రమ్మని, పూజలో గైడ్ చేయమని ప్రార్ధించాను. బాబా తన భక్తులతో ఎప్పుడూ తోడుగా ఉంటారని నాకు తెలుసు, కానీ నేను బాబాని పిలుస్తాను, ఎందుకంటే బాబా నాతో ఉన్నారని, నేను ఒంటరిగా లేను అని నా భావన. ఆయనను నా తండ్రిలా, నా కుటుంబ సభ్యుడిలా ఎల్లప్పుడూ వ్యవహరిస్తాను. బాబా కృప వలన ఆలయంలో నాకు చాలా మంచి దర్శనం లభించింది. నేను అభిషేకం కూడా చేయించాను. అంతేకాకుండా పల్లకి ఉత్సవంలో పల్లకిని పట్టుకునే అవకాశం కూడా నాకు లభించింది. అక్కడ ప్రతి ఒక్కరూ నాకు తగిన సమాచారం ఇవ్వడంలో చాలా సహాయపడ్డారు. లవ్ యు సో మచ్ బాబా.

అనుభవము 3:

షిర్డీలో బాబాకు ధోతి ఇస్తానని మ్రొక్కుకున్నాను. కానీ కొంతకాలం తర్వాత నేను ఆ సంగతి మరచిపోయాను. మేము మా బంధువుల పెళ్ళికి వెళ్ళినప్పుడు, వివాహం తర్వాత నేను నిద్రపోతున్నాను. పంతులుగారు కొన్ని సాంప్రదాయ ఆచారాలు చేయటానికి వచ్చారు. అతను, తాను షిరిడీకి వెళ్ళవలసి ఉందనీ, అందువల్ల 12 గంటలకి ముందు పూర్తి చేయాలనీ చెప్తున్నారు. ఆ మాటలు విని నా మ్రొక్కు గుర్తుకు వచ్చి, వెంటనే మా ఆంటీని బాబా కోసం మంచి ధోతిని తెప్పించమని చెప్పాను. ఆమె దానిని తీసుకురాగానే పంతులు గారికి ఇచ్చి షిర్డీలో బాబాకు అందజేయమని చెప్పాను. సాధారణంగా షిర్డీ సమాధి మందిరంలో ఎవరైనా ఏదైనా ఇచ్చినట్లయితే, వారు దానిని సమాధికి తాకించి తిరిగి ఇచ్చేస్తారు. కానీ నేను పంపిన ధోతీని తిరిగి ఇవ్వకుండా అక్కడే ఉంచేశారని పంతులుగారు నాకు చెప్పినప్పుడు, ‘బాబా నేను ఇచ్చిన ధోతీ ధరించాలని ఉంచుకున్నారు’ అని చాలా ఆనందంగా అనిపించింది.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి!!

Also Read:  Tea & Coffee: ఉదయాన్నే టీ, కాఫీ లకు బదులు ఈ ఆహారాలతో మీ రోజును మొదలుపెట్టండి.