భారతీయులు…దైవపూజలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ప్రతిఒక్కరి ఇంట్లో దైవానికి పూజలు నిర్వహిస్తుంటారు. తమకు నచ్చిన దైవాన్ని ఆరాధిస్తుంటారు. దేవుళ్లకు నైవేద్యం సమర్పించడం అనేది హిందూ సంప్రదాయంలో అందరికీ అలవాటే. ఆ ప్రసాదాన్నే పదిమందికి పంచిపెడతారు. కళ్లకు అద్దుకుని మరీ తింటారు. అంటే మనం నైవేద్యంగా పెట్టినవి దేవుడు తింటున్నాడని మనం నమ్ముతుంటాం. అయితే ఇలా దేవుడికి ప్రసాదం సమర్పించేటప్పడు చాలా ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. నైవేద్యం సమర్పించే విషయంలో కొన్నినియమాలు ఉంటాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. అందరికీ తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. నైవేద్యం సమర్పించే టప్పుడు భక్తులు తీసుకోవల్సిన జాగ్రత్తలు, నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రసాదం తయారీలో నూనె:
దేవుడికి సమర్పించే నైవేద్యాలను చాలా మంది నూనెతో తయారు చేస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దేవుడికి నెయ్యితోనే చేసిన వస్తువులను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మిరపకాయలతో కూడిన వస్తువులను దేవుడికి ప్రసాదం అస్సలు పెట్టకూడదు. ఈ పొరపాటు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట. కాబట్టి ప్రసాదం తయారీకి ఎప్పుడూ నెయ్యినే ఉపయోగించాలి.
ఈ తప్పు అస్సలు చేయవద్దు:
దేవుడికి భక్తితో నైవేద్యం సమర్పిస్తారు. అయితే కొన్నిసమయాల్లో దేవుడికి ఆహారపదార్థాలను నైవేద్యంగా సమర్పించి…వాటిని అక్కడి నుంచి తీసి తింటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం…భగవంతుని ముందున్న నైవేద్యాన్ని అలా వెంటనే తొలగించడం అశుభం. ఆహారపదార్థాలను పండ్లను ఇలా ఏ పదార్థాలను నైవేద్యంగా సమర్పించినా…అక్కడి నుంచి వెళ్లాలి…కొంత సమయం తర్వాత దేవునికి నమస్కరిస్తూ…భగవంతుని ముందు నుంచి నైవేద్యంగా సమర్పించిన వస్తువులను తీసుకోవాలి.
తులసిని సమర్పించవద్దు:
శివునికి పూజలు చేసేటప్పుడు తులసి ఆకులను సమర్పించకూడదు. తులసి ఆకులను శివుడికి వినాయకుడికి సమర్పించకూడదని పురాణాలు చెబుతున్నాయి. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎప్పుడూ కూడా బిల్వ పత్రాలను సమర్పించాలి. అదే సమయంలో గణేశుడికి దర్బలను సమర్పించాలి.
ఆవుకు ఆహారం:
శుభ్రంగా వండిన ఆహారాన్ని మాత్రమే దేవునికి సమర్పించాలి. ఆ ఆహారాన్నిదేవుడికి సమర్పించిన తర్వాత మీరు ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు . కానీ ముందుగానే ఆ ప్రసాదాన్ని ఆవుకు పెట్టినట్లయితే మేలు జరుగుతుంది. ఆవుకు నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి. ఆవుకు ఆహారం అందించడం వల్ల సమస్త దేవతలు సంతోషిస్తారు. ఆ దేవతల అనుగ్రహం భక్తులపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.