Site icon HashtagU Telugu

Vishnu Datta : గురుభక్తిపై బ్రహ్మ రాక్షసుడు, విష్ణు దత్తుడి కథ తెలుసా ?

Lord Vishnu

Lord Vishnu

Vishnu Datta : గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు. గురువు మనకు జీవితంలో మార్గదర్శి. ఆయన చూపే మార్గమే మన పాలిట బంగారు బాట అవుతుంది. గురువుపై మనకు భక్తితో పాటు విశ్వాసం కూడా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా గురువు పట్ల మనకున్న విశ్వాసాన్ని విడవకూడదు. అందుకు నిదర్శనంగా నిలిచే విష్ణు దత్తుడిని కథను ఇవాళ మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

విష్ణు దత్తుని కథ వింటుంటే వినాలనిపించేలా  ఉంటుంది. శ్రీగురు చరిత్రలో ఈ కథ ఉంది. దాని ప్రకారం.. అనగనగా ఒక గ్రామం. ఆ ఊరిలో విష్ణు దత్తుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు దత్తాత్రేయ స్వామి భక్తుడు. ఒక్కసారైనా దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలనే కోరిక విష్ణు దత్తుడికి ఉండేది.  అతడు రోజూ  ఇంటి ముందు ఉన్న రావి చెట్టు మొదల్లో నీరు పోసేవాడు. అయితే ఆ రావి చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. విష్ణు దత్తుడు రోజూ సంధ్య వార్చిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోస్తుండటంతో గాయత్రీ మంత్రం ప్రభావం వల్ల ఆ రాక్షసుడికి శాప విమోచన కలుగుతుంది. శాపం తీరాక ఆ రాక్షసుడు తన లోకానికి తిరిగి వెళ్లిపోతూ విష్ణు దత్తుడిని(Vishnu Datta) పిలుస్తాడు. ‘‘విష్ణు దత్తా  మీ వల్లే నాకు శాపం తీరింది. మీకు ఏదైనా ఒక ఉపకారం చేసి వెళ్లిపోవాలని అనుకుంటున్నాను. మీకేదైనా కావాలంటే చెప్పండి’’ అని రాక్షసుడు అడుగుతాడు. ‘‘నాకు శ్రీ దత్తుడిని దర్శించుకోవాలనే కోరిక ఉంది’’ అని  విష్ణు దత్తుడు బదులిస్తాడు.  దీనికి బ్రహ్మరాక్షసుడు స్పందిస్తూ.. ‘‘నేను నీకు మూడు సార్లు మాత్రమే శ్రీ దత్తుడిని చూపిస్తాను. నువ్వు గుర్తుపట్టలేకపోతే నేను చేసేదేం ఉండదు’’ అంటాడు. దీనికి విష్ణుదత్తుడు అంగీకరిస్తాడు.

Also Read :Kotak Kanya Scholarship: ఇంటర్ పాసైన విద్యార్థినులకు ఏటా రూ1.50 లక్షలు

  • బ్రహ్మ రాక్షసుడు విష్ణు దత్తుడిని తనతో తీసుకెళ్లి ఒక తాగుబోతును చూపిస్తాడు.  ‘‘ఆ తాగుబోతే దత్తుడు వెళ్లి కాళ్ల మీద పడు’’ అని రాక్షసుడు చెబుతాడు. కానీ ఆ తాగుబోతును చూసి విష్ణు దత్తుడు అసహ్యం పెంచుకొని ఇంటికి వెళ్లిపోతాడు.
  • బ్రహ్మరాక్షసుడు రెండోసారి విష్ణు దత్తుడిని తీసుకెళ్లి ఒక స్త్రీని తన తొడమీద కూర్చో బెట్టుకొని ముచ్చట్లాడుతున్న ఓ వ్యక్తిని చూపిస్తాడు. ‘‘ఆ స్త్రీతో ఉన్న వ్యక్తే దత్తుడు వెళ్లి పాదాలపై పడు’’ అని రాక్షసుడు అంటాడు. కానీ కామానికి వశుడైన ఆ వ్యక్తిని చూసి అసహ్యించుకొని విష్ణు దత్తుడు ఇంటికి వెళ్లిపోతాడు.
  • చివరగా మూడోసారి విష్ణుదత్తుడిని బ్రహ్మరాక్షసుడు శ్మశానానికి తీసుకెళ్తాడు. అక్కడ శవాలతో ఉన్న ఓ వ్యక్తిని చూపిస్తాడు. అతడే దత్తుడు అని రాక్షసుడు చెబుతాడు. ఈక్రమంలో విష్ణు దత్తుడు వెళ్లి భక్తితో సదరు వ్యక్తి కాళ్లు గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు విష్ణుదత్తుడికి దత్తాత్రేయస్వామి దర్శనమిస్తారు.  ఏదైనా కోరుకో అని విష్ణు దత్తుడికి దత్తాత్రేయస్వామి చెబుతారు. దీంతో  ఏమీ కోరాలో తెలియక.. ‘‘ ప్రభూ నేను ఇప్పుడే ఇంటికి వెళ్లి నా భార్యను అడిగి వస్తా’’ అని విష్ణు దత్తుడు బయలుదేరుతాడు. భార్య సుశీలమ్మను కలిసి దత్తుడి దర్శనం గురించి విష్ణు దత్తుడు వివరిస్తాడు. ‘‘మరో రెండు రోజుల్లో మీ నాన్న ఆబ్దికం వస్తుంది.. దానికి దత్త స్వామిని భోక్తగా రమ్మని పిలవండి’’ అని ఆమె చెబుతుంది. విష్ణు దత్తుడు దత్తాత్రేయుడి వద్దకు తిరిగొచ్చి.. ‘‘నా భార్య చెప్పినట్లుగా మీరు మా ఇంటికి భోక్తగా రావాలి’’ అని కోరుతాడు. అందుకు దత్తాత్రేయస్వామి  సరేనంటారు.
  • చివరకు ఆబ్దికం రోజు వస్తుంది. మధ్యాహ్నం వేళ దత్తాత్రేయుడు భోక్తగా విష్ణు దత్తుడికి ఇంటికి వస్తారు. సుశీలమ్మ, విష్ణు దత్తుడు ఆనందంతో స్వామికి కాళ్లు కడిగి ఇంట్లోకి ఆహ్వానిస్తారు.
  • దత్తాత్రేయుడు వచ్చి పీట మీద కూర్చుని మిగతా ఇద్దరు భోక్తలు ఎక్కడ అని అడుగుతారు. మిగతా ఇద్దరినీ పిలవటం మరచిపోయామని ఆ దంపతులు బదులిస్తారు. మహాసాధ్వి అయిన సుశీలమ్మ ప్రార్థించగా అగ్ని దేవుడు, సూర్య దేవుడు భోక్తలుగా విష్ణుదత్తుడి ఇంటికి వస్తారు.
  • భోజనం చేశాక ఆ ముగ్గురు భోక్తలు కలిసి దంపతులను దీవిస్తారు. ధార్మిక జీవనాన్ని గడిపి అంత్యమున వైకుంఠానికి వస్తారని అనుగ్రహిస్తారు.

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.