Site icon HashtagU Telugu

Yadadri : యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆమోదం

CM Revanth Reddy approved the formation of Yadagirigutta Temple Board

CM Revanth Reddy approved the formation of Yadagirigutta Temple Board

Yadagirigutta Temple Board : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆమోదం తెలిపారు.

టీటీడీ తరహాలో యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు ఉండాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం యాదాద్రిగా పిలుస్తున్న పేరును యాదగిరిగుట్టగా మార్చాలని సూచించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీని తీసుకురావాలని, అవసరమైతే టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. కొండపై నిద్రచేసే భక్తులు తమ మొక్కుల్ని తీర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని, బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులను పూర్తి చేయాలని తెలిపారు.

అంతేకాక.. ఆలయ అభివృద్ధి కోసం చేస్తున్న భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఈ మేరకు అవరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని ఆదేశించారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకుని.. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చాలని ఆదేశించారు.

Read Also: Vladimir Putin : భారత్‌ ఓ గొప్ప దేశం: రష్యా అధ్యక్షుడు ప్రశంసలు..