Tirumala Brahmothsavalu : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. తిరుమలకు ముఖ్యమంత్రి.. పట్టు వస్త్రాలు సమర్పణ..

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లపై టీటీడీ ఈఓ ధర్మారెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు.

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 06:33 PM IST

తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) ఈనెల 17న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి 26 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లపై టీటీడీ ఈఓ ధర్మారెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు.

టీటీడీ(TTD) ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 18న ధ్వజారోహణం రోజు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు 25 వేలు జారీ చేస్తాం. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్లైన్ ద్వారా ఇప్పటికే రోజుకు 15 వేలు జారీ చేశాం. టోకెన్ లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా నేరుగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. నిత్య అన్నదానం,వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లతో పాటు రద్దీగా ఉండే ఇతర ప్రాంతాల్లో కూడా అన్న ప్రసాదాలు వితరణ జరుగుతుంది. తలనీలాలు సమర్పించే భక్తులకు ఆలస్యం కాకుండా 1200 మంది క్షురకులు 24 గంటలు పాటు షిఫ్టుల వారీగా సేవలందిస్తారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతిల మధ్య ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు 2000 ట్రిప్పులు తిరుగుతాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రత కోసం 3500 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బంది సేవలందిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఫోటో ఎగ్జిబిషన్, పుష్ప ప్రదర్శనశాల ఏర్పాటు చేశాము అని తెలిపారు.

అకాగే స్వామివారి వాహన సేవల గురించి కూడా తెలిపారు. స్వామివారి వాహన సేవలు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 10 గంటల వరకు జరుగుతాయి. ఈ నెల 18న బంగారు తిరుచ్చి, ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవలు, 19న చినశేషవాహనం, స్నపనతిరుమంజనం, హంసవాహనం, 20న సింహవాహనం, స్నపన తిరుమంజనం, ముత్యపు పందిరి వాహనం, 21న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 22న మోహినీ అవతారం, గరుడసేవ, 23న హనుమంత వాహనం, సువర్ణ రథం, గజవాహనం, 24న సూర్యప్రభ వాహనం, స్నపన తిరుమంజనం, చంద్రప్రభ వాహనం, 25న రథోత్సవం, అశ్వవాహనం, 26న పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నపన తిరుమంజనం, చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించనున్నట్టు తెలిపారు.

 

Also Read : TTDs Key Decision : భక్తుల భద్రత కోసం టీటీడీ కీలక నిర్ణయం