Ayodhya : సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య..శ్రీరామ నవమికి 40 లక్షల మంది భక్తులు..!

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 12:26 PM IST

Ram Navami:రామజన్మభూమి అయోధ్య శ్రీరామ నవమి (Ram Navami) వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది (Ayodhya Ram Mandir). బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి శ్రీరామ నవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు(devotees) తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అదేవిధంగా వేడుకల నేపథ్యంలో మూడు రోజుల పాటు స్వామి వారి దర్శన సమయాలను కూడా పెంచారు. ఏప్రిల్‌ 16, 17, 18 తేదీల్లో 20 గంటల పాటూ ఆలయాన్ని భక్తుల కోసం తెరిచి ఉంచాలని నిర్ణయించారు. సుమారు 40 లక్షల మంది భక్తులు శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్యకు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీ రామ మందిర్‌ ఆలయ ట్రస్ట్‌ ఏడు వరుసల్లో భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది.

Read Also: 4600 RPF Jobs : 4660 రైల్వే పోలీస్ జాబ్స్.. టెన్త్ అర్హతతోనే అవకాశం

ఇదిలా ఉండగా.. ఉత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నయా ఘాట్‌ జోన్‌, నాగేశ్వరనాథ్‌ జోన్‌, హనుమాన్‌గర్హి టెంపుల్‌ జోన్‌, కనక్‌ భవన్‌ టెంపుల్‌ జోన్‌ సహా ఇతర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు వేడుకలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ఆ మూడు రోజులు 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వివిధ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండేలా కంట్రోల్ రూమ్‌లో ఏర్పాట్లు చేశారు. 24 గంటల డ్యూటీ కోసం మూడు షిఫ్టుల్లో అధికారులను నియమించనున్నారు. పోలీసు శాఖతోపాటు, నగర ఆరోగ్య శాఖ, అయోధ్య మున్సిపల్‌ కార్పొరేషన్‌, విద్యుత్‌ శాఖ బృందాలను కూడా అప్రమత్తం చేశారు.

రామజన్మభూమి మార్గంలో అదనంగా 80 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్గంలో జర్మన్ హ్యాంగర్లు ఉండడంతో కొన్ని కెమెరాలు సుదూర దృశ్యాలను మాత్రమే తీయగలుగుతున్నాయి. ఈ క్రమంలో క్లోజ్ అప్ దృశ్యాలను చిత్రీకరించేందుకు అదనపు కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో దాదాపు 50 చోట్ల వాటర్ కూలర్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు.

Read Also: NTR – Allu Arjun : ఏడేళ్ల తరువాత ఎన్టీఆర్ రికార్డుని బ్రేక్ చేసిన అల్లు అర్జున్..

మరోవైపు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌ 15 నుంచి 18 వరకు రామ్‌లల్లా దర్బారులో వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవని మార్గదర్శకాలను జారీ చేస్తూ ట్రస్టు తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి 18 మధ్య వీఐపీ పాస్‌లు చేసిన వారి పాస్‌లు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. చైత్ర శుక్ల సప్తమి అంటే సోమవారం నుంచి అయోధ్యలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రామమందిరం ట్రస్ట్ వీఐపీ దర్శనాలకు బ్రేక్‌ వేసింది.