Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆసక్తికరమైన వార్త. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి పునరావృతం కానుంది. మెగాస్టార్ కెరీర్‌లో 158వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలాఖరులోగా సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి షెడ్యూల్‌లో చిరంజీవిపై కొన్ని సోలో ఎంట్రీ సన్నివేశాలను, ఆ వెంటనే ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో విజయాన్ని అందుకున్న చిరంజీవిని ఈ సినిమాలో పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం మాస్ అంశాలకే పరిమితం కాకుండా కుటుంబ భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ బాబీ ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవిని సరికొత్తగా ప్రజెంట్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో, ఇండస్ట్రీలోనూ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మాస్, ఎమోషన్ కలగలిపి రానున్న ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందేమో చూడాలి.
