Vijay – Rashmika Wedding Food Menu : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 26, గురువారం ఉదయం 10:10 గంటలకు ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే, వేదిక రాజస్థాన్ అయినప్పటికీ, విందు భోజనంలో మాత్రం పక్కా తెలంగాణ మరియు కర్ణాటక రుచులు ఘమఘమలాడాయి. తమ మూలాలను మర్చిపోకుండా, అతిథులకు ఇరు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలను వడ్డించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు ఈ కొత్త దంపతులు.
విజయ్ దేవరకొండ తెలంగాణ వాడు కావడంతో మెనూలో తెలంగాణ స్పెషల్స్ రాజ్యమేలాయి. ముఖ్యంగా నోరూరించే తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు ఘాటైన నాటుకోడి పులుసు, కరకరలాడే గారెలు, పప్పు మరియు నోటికి హాయినిచ్చే పచ్చిపులుసులను వడ్డించారు. పాతబస్తీ స్టైల్ కీమా సమోసాలను స్టార్టర్స్‌గా అందించడం అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ రుచుల ఘాటు ఉదయ్‌పూర్ కోట గోడల మధ్య కొత్త అనుభూతిని మిగిల్చింది.
మరోవైపు రష్మిక కర్ణాటకకు చెందిన వారు కావడంతో, ఆ రాష్ట్ర విశిష్ట వంటకాలను కూడా మెనూలో చేర్చారు. కర్ణాటక స్పెషల్ బిసిబెలే బాత్, తియ్యని మైసూర్ పాక్‌లతో పాటు, కూర్గ్ ప్రాంతపు అత్యంత ప్రసిద్ధ వంటకమైన ‘పంది కర్రీ’ (పోర్క్) ని కూడా వడ్డించారు. గతంలో తాను ఈ ‘కొడగు’ సంప్రదాయ వంటకాన్ని ఎంతో ఇష్టంగా తింటానని రష్మిక చెప్పిన సంగతి తెలిసిందే. సాయంత్రం జరగబోయే ‘కొడువ’ సంప్రదాయ పెళ్లి వేడుకకు కూడా ఈ వంటకాలే హైలైట్‌గా నిలవనున్నాయి. ఇలా రెండు రాష్ట్రాల సంస్కృతులను వంటల ద్వారా కలిపి, తమ వివాహాన్ని ఒక మధుర స్మృతిగా మార్చుకున్నారు ‘వైరల్’ కపుల్.
